వామ్మో.. పెళ్లి కోసం రుణాలు తీసుకున్నవారు ఎంత పెరిగారంటే..!

by  |
loan-for-marriage
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి భారత్‌లోని రుణాలు, రుణాలు తీసుకునే దృక్పథంలో భారీ మార్పులను తీసుకొచ్చింది. రుణ విభాగంలో రిటైల్ కస్టమర్ల నుంచి అత్యధికంగా డిమాండ్ ఏర్పడిందని, ప్రజలు వైద్యం, ఉద్యోగం కోల్పోయాక రోజువారీ ఖర్చుల కోసం రుణాలను ఆశ్రయించారని ఓ నివేదిక తెలిపింది. తాజాగా, ప్రముఖ డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్ ఇండియాలెండ్స్ చేసిన అధ్యయనంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది కరోనా సెకెండ్ వేవ్ సమయంలో ప్రజలు ఎక్కువగా ‘పెళ్లిళ్ల’ కోసం రుణాలు తీసుకున్నట్టు అధ్యయనంలో తేలింది. ఈ రుణాలు ఇతర రుణాల కంటే అత్యధికంగా 33 శాతం నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో వివాహల కోసం తీసుకున్న రుణాలు 22 శాతమని నివేదిక తెలిపింది. ఇదే సమయంలో వ్యాపార రుణాలు 16 శాతం నుంచి 23 శాతంతో స్వల్పంగా పెరిగాయి. ఆసక్తికరంగా గతేడాది అత్యధికంగా గృహ అవసరాల కోసం తీసుకున్న రుణాలు ఈ ఏడాదిలో 40 శాతం నుంచి 24 శాతానికి తగ్గాయి. ఆర్థిక అవసరాలను సర్దుబాటు చేసుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనడానికి ఈ గణాంకాలు సాక్ష్యమని నివేదిక అభిప్రాయపడింది.

10 శాతం మంది మహిళలే..

అంతర్జాతీయ యువత దినోత్సవం సందర్భంగా దేశీయ యువతలో రుణాల గురించి వివరాలను సేకరించారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పూణె సహా తొమ్మిది ప్రధాన నగరాల్లోని వేతనం, స్వయం ఉపాధి కలిగిన యువత నుంచి వివరాలు సేకరించినట్టు నివేదిక స్పష్టం చేసింది. దీని ప్రకారం.. రుణ అవసరాల్లో ప్రధాన విభాగాలైన పెళ్లి, వ్యాపారం, విద్య, ప్రయాణం, గృహ, వైద్య, ద్విచక్ర వాహనాలు, ఇంకా ఇతర రుణాలకు సంబంధించి వివరాలను నివేదిక పొందుపర్చింది. గతేడాదిలో వాయిదా పడటంతో పెళ్లిళ్ల రుణాలకు దరఖాస్తులు పెరిగాయని నివేదిక తెలిపింది. దీని తర్వాత ఉద్యోగ భద్రత, సెకెండ్ వేవ్ ఆందోళనతో కొత్త వ్యాపార రుణాలకు డిమాండ్ పెరిగింది. అలాగే, వివాహాలు, వ్యాపారాల కోసం వచ్చిన రుణ దరఖాస్తుల్లో 10 శాతం మహిళలు ఉన్నారని నివేదిక పేర్కొంది. వివాహ రుణాల సగటు మొత్తం రూ. 4.13 లక్షలు కాగా, వైద్య ఖర్చుల రుణ సగటు రూ.4 లక్షలు, ఇంటి ఖర్చులకు రూ. 3.43 లక్షలు, వ్యాపార రుణాల సగటు మొత్తం రూ. 2.62 లక్షలుగా ఉంది. విద్య, వాహన రుణాలు గతేడాది స్థాయిలో ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

Next Story

Most Viewed