వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్.. వారానికి ఒక్కసారి మాత్రమే కాపురం!
వివాహం చేసుకోవడానికి చాలా మంది యువతీ, యువకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మరికొంత మంది పెళ్లి అయిన జంటలు కూడా జీవితంపై విరక్తి చెందుతున్నారు.
వివాహ బంధంతో ఏర్పడే బరువు బాధ్యతలు మోయడం అంత సులభం కాదని పెళ్లంటే నూరేళ్ల మంట అన్నట్టుగా చూస్తున్నారు. పెళ్లి జరిగిన వారు కొంత మంది తమ స్వేచ్ఛను, స్వాతంత్యాన్ని కోల్పోతున్నామని వాపోతున్నారు.
ఇప్పుడున్న జంటలు చాలా మంది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ ఒకే ఇంట్లో ఉండలేకపోతున్నారు.
మరికొంత మంది డ్యూటీ చేసి ఇంటికి వెళ్లగానే ఒత్తిడితో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. లేక ఆధిపత్యం చెలాయిస్తున్నారనో, అభిరుచులు కలవకనో విడిపోతున్నారు.
అలాగే కొందరికి చిన్న చిన్న విషయాల్లోనే గొడవలు వచ్చి విడాకులు తీసుకుని శాశ్వతంగా దూరం అవుతున్నారు. సమాజంలో నిత్యం ఇలాంటివే జరుగుతున్నాయి.
దీనికి పరిష్కారంగా జపాన్‌లోని కొన్ని జంటలు ఓ కొత్త ట్రెండ్‌ను తీసుకువచ్చి దాన్నే ఫాలో అవుతూ అందరూ సంతోషంగా జీవిస్తున్నారు.
అదేంటంటే ‘వీకెండ్ మ్యారేజ్’ వారంలో ఒక్కసారి మాత్రమే కాపురం చేస్తారట. ఆ ట్రెండ్‌కే ఎక్కువ మంది కపుల్స్ మొగ్గు చూపుతున్నారు.
ఇందులో ప్రతిరోజూ ఇంటికి వెళ్లాల్సిన పని ఉండదు. అంతేకాకుండా ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదట.
వారం మొత్తం ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ, వారికి నచ్చినట్టు ఉంటూ నచ్చిన విధంగా జీవితాన్ని అనుభవిస్తారు.
వారానికి ఒక్కసారి తమ భాగస్వామిని కలిసే ముందే వీకెండ్ ప్లాన్స్ వేసుకుంటారు. కలిసిన తర్వాత ఒకరిపై ఒకరు ప్రేమను చూపించుకుంటూ స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చుకుంటారు.
ఈ వివాహంలో భార్యభర్తలు ఎవరికి సంబంధించిన ఖర్చులకు వారే డబ్బులు ఖర్చుపెట్టుకోవాలి. ఒకవేళ పిల్లలు ఉంటే చెరి సగం భరించాలి.
ఇలాంటివన్నీ ఉండటం వల్ల జపాన్‌లో ఎక్కువగా వీకెండ్ మ్యారేజ్ కాన్సెప్ట్ నచ్చుతుంది. అందరూ ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నారట.