ఈ జంతువులు తమ సొంత పిల్లలనే తినేస్తాయి..
భూమి మీద జీవించే అనేక రకాల జంతువులు మనుషుల వలే తమ సంతానాన్ని సంరక్షిస్తాయి. ప్రేమగా చూసుకుంటాయి. కాని కొన్ని మాత్రం వాటి పిల్లల్ని అవే తింటాయి. ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది వాస్తవం. అసలు అలాంటి జంతువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బ్లాక్ విడో స్పైడర్ : ఆడ నల్ల సాలెపురుగులు సంభోగం సమయం ముగిసిన తర్వాత మగ సాలెపురుగులను తినేస్తాయి. మరొకరితో జతకట్టకుండా ఇలా చేస్తాయి. అలాగే అప్పుడప్పుడు ఆహారం తక్కువగా ఉంటే వాటి సొంత పిల్లలను తింటాయి.
2. ప్రేయింగ్ మాంటిస్ : ఆడ మాంటిస్‌లు కొన్నిసార్లు సంభోగం తర్వాత మగపిల్లలను తింటాయి. అలాగే ఒత్తిడికి గురైనప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు వాటి సొంత గుడ్లను కూడా భుజిస్తాయి.
3. చిట్టెలుక : చిట్టెలుక తల్లులు తమ పిల్లలు కరిసే విధంగా ప్రవర్తించినా లేదా పిల్లలు అనారోగ్యంగా కనిపించినా వాటిని తినేస్తుంటాయి.
4. ఎలుకలు : ఆడ ఎలుకలు ఒత్తిడికి గురైతే.. పిల్లలు బలహీనంగా ఉంటే తినేస్తాయి. అనుకోని విధంగా చనిపోయినా సరే ఆహారంగా తీసుకుంటాయి.
5. ధృవపు ఎలుగుబంటి : అరుదైన సందర్భాల్లో మగ ధృవపు ఎలుగుబంట్లు పిల్లలను చంపి తింటాయి. అది కూడా ఆహారం కోసం పోరాటం చేసి చేసి ఎక్కడ దొరకకపోవడంతో విసుగు చెంది తమ పిల్లలను అవే చంపుకు తింటాయి.
6. గోల్డెన్ ఈగిల్ : గోల్డెన్ ఈగిల్ తల్లిదండ్రులు ఆహారం తక్కువగా ఉన్న సందర్భాల్లో తమ సొంత పిల్లలను తినేస్తుంటాయి.
7. సింహం : పిల్లల్ని చంపుకొని తినే జంతువుల్లో మృగరాజు కూడా ఒకటి. ముఖ్యంగా మగ సింహాలు ఆధిపత్యాన్ని పొందడానికి పిల్లలను చంపేస్తాయంటున్నారు నిపుణులు. మందలో కొత్త మగ సింహం పుడితే అది సంతానోత్పత్తి చేసే భాగస్వామిని దొంగిలించవచ్చు లేదా భూభాగాన్ని ఆక్రమిస్తాయనే భయంతో మగ సింహాలు పిల్ల సింహాలను చంపేస్తాయి.
8. హైనా : హైనా ఒక రకమైన మాంసాహారి అయిన క్షీరదము. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాలలో కనిపించే జంతువు. ఈ జాతిలో నాలుగు రకాలైన ఉపజాతులున్నాయి. అవి చారల హైనా , బ్రౌన్ హైనా, మచ్చల హైనా, ఆర్డ్‌వోల్ఫ్. ఇందులో అతి ప్రమాదకరమైనది చుక్కల హైనా. ఇవి వంశంలో తక్కువ స్థాయి ఆడపిల్లలను చంపి తింటాయి.