ఆస్తుల్ని అమ్మేస్తాం- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

by  |
ఆస్తుల్ని అమ్మేస్తాం- రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించిన దళితబంధును కచ్చితంగా అమలు చేస్తామని, దానికి అవసరమైన నిధులను సమకూర్చుకోడానికి భూముల్ని, ఆస్తుల్ని అమ్మేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇప్పుడు అమ్ముతున్న భూములన్నీ నిరర్ధకమైనవేనని అన్నారు. ప్రభుత్వ భూములను అమ్మకం ద్వారా మాత్రమే కాక ఇతర మార్గాల్లోనే ఆర్థిక వనరులను సమకూర్చుకోడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయన్నారు. మంత్రి హరీశ్‌రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ, దళితబంధును పక్కాగా అమలు చేయాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందుకోసం నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడంలో తప్పేముందని పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు.

తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని నొక్కిచెప్పారు. వేతనాల చెల్లింపుకు జరుగుతున్న జాప్యం గురించి పాత్రికేయులు ప్రస్తావించగా, ఆర్థిక వనరులకు కొదవ లేదని, చాలా రాష్ట్రాలకంటే ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. దేశ సగటు ఆర్థిక వృద్ధితో పోల్చుకున్నా లేక మరే రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటుతో పోల్చి చూసినా తెలంగాణ మెరుగైన స్థానంలో ఉన్నదని, కొన్ని ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే దక్షిణ భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం చేస్తున్న అప్పులుగానీ, ఇప్పటివరకు ఉన్న మొత్తం రుణాలుగానీ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడే ఉన్నాయని, రాష్ట్రంలో తలసరి ఆదాయం కూడా సంతృప్తికరంగా ఉన్నదన్నారు.

దళితబంధు అమలు కోసం ప్రతీ ఏటా రూ. 20 వేల కోట్లను ఖర్చు చేయడం కోసం స్వీయ ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంపై ప్రశ్నించగా, ఆర్థిక సాయం పేరుతో దళిత కుటుంబాలకు వెళ్తున్న డబ్బంతా తిరిగి సమాజపరమే అవుతుందని, ఏదో ఒక వృత్తి లేదా వ్యాపారం కోసమే వెచ్చించబడుతుందని, ఆ ప్రకారం రాష్ట్ర జీఎస్‌డీపీ పెరుగుదలకు, రాష్ట్ర సంపద పెరగడానికి దోహదపడుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు, మిషన్ భగీరథకు, మిషన్ కాకతీయకు చేసిన ఖర్చులు కూడా భారీగానే ఉన్నా దాని ఫలాలు వినియోగంలోకి రావడం వల్లనే వ్యవసాయ రంగంలో వృద్ధి, చివరకు జీఎస్‌డీపీ పెరగడానికి కారణమైందన్నారు. ఇప్పుడు దళిత బంధు ద్వారా ఒక్కో కుటుంబానికి వెళ్ళే పది లక్షలు కొంతకాలం తర్వాత సంపదను సృష్టించడానికే ఉపయోగపడుతుందన్నారు.

ఆస్తులు అమ్ముకోవడంపై ప్రశ్నించగా, కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఒక మంత్రిత్వశాఖనే ఏర్పాటు చేసి ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నదన్నారు. ఏడేళ్ళ కాలంలో తెలంగాణ ఆర్థిక వృద్ధి సాధిస్తే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మాత్రం తిరోగమనంలో పోతున్నదని, చివరకు దేశ సగటు జీడీపీ వృద్ధిరేటు, ఆర్థిక వృద్ధి రేటు పొరుగున ఉన్న చిన్న దేశమైన బంగ్లాదేశ్‌కంటే అధ్వాన్నంగా ఉన్నదని ఉదహరించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం కోసం పలు గణాంకాలను సైతం మంత్రి హరీశ్‌రావు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు, తప్పులను ఎత్తి చూపడం ద్వారా రాష్ట్ర ప్రతిష్టనే మంటగలుపుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు.

Next Story

Most Viewed