ఆందోళనలను దేశవ్యాప్తం చేస్తాం: రాకేశ్ తికాయత్

by  |
ఆందోళనలను దేశవ్యాప్తం చేస్తాం: రాకేశ్ తికాయత్
X

చండీగఢ్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రస్తుతం దేశరాజధాని కేంద్రంగా సాగుతున్న ఆందోళనలను దేశవ్యాప్తం చేస్తామని రైతు నేత రాకేశ్ తికాయత్ అన్నారు. దేశంలోని ప్రతిమూలకు ఆందోళనలను తీసుకెళ్తామని, సాగు చట్టాలపై అవగాహన కల్పించి పోరాటాన్ని బలోపేతం చేస్తామని వివరించారు. తమది ప్రజా ఆందోళన అని, దీన్ని కచ్చితంగా విజయవంతంగా చేపడుతామని పేర్కొన్నారు. హర్యానాలో కిట్లానా టోల్ ప్లాజా సమీపంలో రైతు నేతలు మహాపంచాయత్ నిర్వహించారు. వందలాది మంది హాజరైన ఈ కార్యక్రమంలో తికాయత్ మాట్లాడుతూ… రైతుల ఆందోళనలను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు జరిగాయని వివరించారు. ముందుగా పంజాబ్-హర్యానా, సిక్కులు-సిక్కేతరులని విభజించే ప్రయత్నం చేశారని తెలిపారు. కానీ, తామంతా రైతులమేనని, వారి కుట్రలను అధిగమించామని చెప్పారు.

సర్దార్లను తమ నుంచి ఎప్పటికీ దూరం చేయలేరని పేర్కొన్నారు. రైతునేతలు బలమైన కూటమిని ఏర్పాటు చేశారని, వారికి అభినందనలు తెలిపారు. 40 మంది సభ్యులతో ఉన్న కమిటీని ప్రశంసించారు. అందులో ఏ ఒక్క నేత బలహీనంగా లేరని స్పష్టం చేశారు. కాగా, మేవాట్‌లోని సునేదాలో మరో మహాపంచాయత్ జరిగింది. ఆ కార్యక్రమంలో భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నాం సింగ్ చాదుని మాట్లాడుతూ… నేడు ఆందోళనలు కేవలం కొన్ని రాష్ట్రాలకే చెందినవి కావని, వేగంగా దేశమంతటికి వ్యాపిస్తున్నాయని అన్నారు. అన్ని మతాల దైవాలను, గురువులను పేర్కొంటూ అందరినీ కలుపుకుని వెళ్లే నినాదాలను ఇచ్చారు. హిందు, ముస్లిం, సిక్కులు, క్రైస్తవులందరూ భాయ్ భాయ్ అని నినదించారు.

జవాన్ల తల్లిదండ్రులూ నిరసన చేస్తారు

కేంద్ర ప్రభుత్వం రైతులు చెబుతున్న అంశాలను వినాలని రాకేశ్ తికాయత్ అన్నారు. లేదంటే ఆందోళనలు మరో దశకు చేరుకుంటాయని హెచ్చరించారు. ఆర్మీ, పోలీసుల్లో పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులనూ ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తారని తెలిపారు. వారి తండ్రులూ ఆందోళనల్లో కూర్చుంటారని చెప్పారు. సింఘు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బారీకేడ్లు, ఇనుప చువ్వలు, కంచె, బలగాలను మోహరించింది. ఈ బలగాలకు కౌంటర్‌గానే ఆర్మీలో పనిచేస్తున్నవారి కుటుంబ సభ్యులతో ధర్నా చేయడానికి ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తున్నది. తాము జవాన్లను గౌరవిస్తామని, రైతులకు గౌరవంగా జవాన్ల కుటుంబాలు ఇక్కడకు వచ్చి ఆందోళన చేస్తాయని రాకేశ్ అన్నారు.

Next Story

Most Viewed