'ఆశల పంట.. నిరాశలు ఇంట'

by  |
ఆశల పంట.. నిరాశలు ఇంట
X

దిశ న‌ల్లగొండ‌: ఆశతో అడుగులు ముందుకేశారు.. అందుకు అనుగుణంగానే అదృష్టం కలిసొచ్చింది కానీ, ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. ఆ విషయం పక్కకు పెడితే.. ఉన్నది కూడా పోయేలా ఉంది. దీంతో.. వారంతా తీవ్ర దిగ్భ్రాంతిలోకి వెళ్లిపోయారు. ఇలా అయితే అంతా ఆగమే అనుకుంటున్నారు. అదేంటో మీరే చూడండి…

పండ్ల తోట‌ల ఉత్ప‌త్తిపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ది. జ‌న‌తా క‌ర్ఫ్యూ మ‌రుస‌టి రోజు నుంచి తెలంగాణ నిర‌వ‌ధిక బంద్ కావ‌డంతో పండ్ల ఎగుమ‌తులు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. పండ్ల తోట‌ల‌ను లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు ఈసారి పెట్టుబ‌డి కూడా వెళ్ల‌డం క‌ష్ట‌మేన‌ని, దివాళ తీయ‌డం కాయ‌మ‌ని వాపోతున్నారు. క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో సామాజిక దూరం పాటించ‌డంతోపాటు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుంటే ఈ వైర‌స్ సంక్ర‌మ‌ణ‌ను అడ్డుకోవ‌చ్చ‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ప్ర‌ధాని మోదీ.. ఏప్రిల్ 14 వ‌ర‌కు లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌గా సీఎం కేసీఆర్ మ‌రో రోజు పెంచి వ‌చ్చే నెల 15 వ‌ర‌కు లాక్ డౌన్ పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో సాగు చేసిన బ‌త్తాయి, నిమ్మ‌, దానిమ్మ‌, పుచ్చ పండ్ల తోట‌ల రైతులు ప‌రేషాన్ చెందుతున్నారు.

పండ్ల సాగు వివ‌రాలు ఇవీ…

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో 46 వేల 800 ఏకరాలలో బత్తాయి తోటలు విస్తరించి ఉండగా అందులో 30 వేల ఎకరాల పై చిలుకు బత్తాయి కాపుకొచ్చింది. ఈ సీజన్ లో బత్తాయి 43 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్న అంచనా. అదే విదంగా 16 వేల విస్తీర్ణంలో నిమ్మ సాగు చేయ‌గా ఇప్పటికి 8,800 ఎకరాల్లో పంట దిగుబ‌డికి వ‌చ్చింది. 52 వేల 400 మెట్రిక్ టన్నుల నిమ్మ కాయ‌ల దిగుబ‌డి కానుంద‌న్న‌ది ఉద్యాన‌వ‌న శాఖ అధికారులు అంచ‌నా వేశారు. అలాగే 5,300 ఎకరాల విస్తీర్ణంలో వేసిన పుచ్చకాయ తోటను సాగు చేశారు. ఈ సీజ‌న్‌లో పుచ్చ‌కాయ దాదాపు లక్షకు పై చిలుకు మెట్రిక్ టన్నుల పంట దిగుబడికి సిద్ధంగా ఉంది. అయితే కాపుకొచ్చిన పండ్లను చెట్ల నుంచి కోయ‌క‌పోవ‌డంతో చెట్ల‌పైన పండుపారి రాలిపోతున్నాయ‌ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . మ‌రి కొంద‌రు పండ్లను కోసి నిల్వ పెట్టారు. అయితే వాటిని ర‌వాణా చేయ‌డానికి స‌రైన వాహ‌నాలు లేక‌పోవ‌డంతో నిల్వ ఉంచిన పండ్లు జ‌న‌తా క‌ర్ఫ్యూ మ‌రుస‌టి రోజు నుంచి పాడైపోతున్నాయ‌ని రైతులు అందోళన వ్య‌క్తం చేస్తోన్నారు.

చేతికొచ్చిన పంట‌కు ర‌వాణా లేక‌..

చేతికి వచ్చిన పంటకు రవాణా సౌకర్యం లేక పోవడంతో రైతాంగం గాబరా పడుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని బ‌త్తాయి, నిమ్మ, పుచ్చకాయ పంటను ఇక్కడి రైతాంగం ట్రేడర్స్ ద్వారా హైదరాబాద్, ఢిల్లీతో పాటు గుజరాత్ కు ఎగుమతి చేసేవారు. అయితే కరోనా వైరస్ కారణంగా ప్రస్తుత పరిస్థితులు రవాణా రంగం మీద చూపడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎక్క‌డిక‌క్క‌డ ర‌వాణా స్తంభించిపోవ‌డంతో పాటు లారీల‌ను నిలిపివేశారు. అంత‌రాష్ట్ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఎన్ వోసి ఉన్న వాహ‌నాల‌ను మాత్ర‌మే అనుమ‌తిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఊరు గ్రామ స‌రిహ‌ద్దులో మా ఊరికి మీరు రావొద్దు ఈ ఊరి దాటి మేం బ‌య‌ట‌కు రామంటూ ముళ్లచెట్ల‌ను న‌రికి రోడ్డుకు అడ్డంగా కంచె వేశారు. మ‌రి కొన్ని గ్రామాల్లో రోడ్డుకు అడ్డంగా మ‌ట్టి పోయించారు. మ‌రికొన్ని గ్రామాల్లో రోడ్ల‌కు అడ్డంగా రాళ్లు పెట్టారు. ఇలా ఎవ‌రికి తోచిన‌ట్టు వారు రోడ్ల‌ను దిగ్బంధం చేశారు. దీంతో పండ్ల తోట‌ల వ‌ద్ద‌కు లారీలు రావ‌డానికి వీలు లేకుండా పోయింది. ఇత‌ర గ్రామ‌స్తులు ఊర్లోకి రావ‌డాన్ని చాలామంది అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితిలో చేతికొచ్చిన పండ్ల ఉత్ప‌త్తుల‌ను ఎలా అమ్ముకోవాల‌న్న దిగులు రైతులను వెంటాడుతున్న‌ది.

మ‌న పండ్ల‌ను మ‌న‌మే తినాల‌న్న సీఎం!

క‌రోనా వైర‌స్‌ను ఎదుర్కోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధక శ‌క్తి పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. సీ విట‌మిన్ ఉండే ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మ‌, బ‌త్తాయి, దానిమ్మ పండ్ల‌ల్లో సీ విట‌మిన్ పుష్క‌లంగా ఉంటుంది. అందుకే శుక్ర‌వారం సీఎం కేసీఆర్ నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో కూడా ఇదే విష‌యాన్ని ఉటంకించారు. ఇక్కడి పంటను ఇక్కడి ప్రజలు వినియోగించుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన అన్నారు. రోగ నిరోధక శక్తికి సి విటమిన్ దోహదపడుతుందని నిపుణులు చెబుతున్న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అటువంటి విటమిన్లు కలిగి ఉండి సమృద్ధిగా వచ్చిన బత్తాయి, నిమ్మను ఎగుమతులకు ప్రాధాన్యత ఇవ్వకుండా జిల్లా ప్రజలు వినియోగించుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్యం సమకూరుతుందని అభిప్రాయపడ్డారు.

అదే సమయంలో పొటాషియం వంటి పోషకాలు కలిగి ఉన్న పుచ్చకాయ వేసవిలో విరివిగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే జిల్లాలోను హైదరాబాద్ తరహాలో సంచార రైతు బజార్ల యోచనతోపాటు కూరగాయల మార్కెట్ల తరహాలో ప్రజలలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే బత్తాయి, నిమ్మ, పుచ్చకాయ వంటి పంటలను విక్రయించేందుకు వీలుగా న‌ల్ల‌గొండ జిల్లా మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి, న‌ల్ల‌గొండ జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా క‌లెక్ట‌ర్లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం సూచించిన విష‌యం విదిత‌మే.

ఆంక్ష‌ల ఎత్తివేత‌తో ఇబ్బందులు లేవు..

బత్తాయి, నిమ్మ ఎగుమతులకు ఇకపై ఎటువంటి ఇబ్బంది ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. జాతీయంగా సరుకులు, పంట దిగుబడులు రవాణా చేసే వాహనాల మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన క్రమంలో బత్తాయి, నిమ్మ రైతులు నిరభ్యంతరంగా ఎగుమతి చేసుకోవచ్చని ఆయన చెప్పారు.



Next Story

Most Viewed