రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. రేపటినుంచి అవి కూడా మాఫీ

by  |
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్.. రేపటినుంచి అవి కూడా మాఫీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇచ్చిన హామీ మేరకు మూడు లక్షల మంది రైతులకు రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం ఇప్పటికే మాఫీ చేసిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రేపటి నుంచి రాష్ట్రంలోని 6లక్షల మంది అన్నదాతలకు రూ.50 వేలలోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని, ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. దీంతో మొత్తం 9 లక్షల మంది రైతన్నలు రుణ విముక్తులవుతారని చెప్పారు. మిగిలిన వారికి కూడా దశలవారీగా రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. పంద్రాగస్టు సందర్భంగా సీఎం కేసీఆర్‌ గోల్కొండ కోట నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

రైతులు సంపన్నులు కావాలి..

రైతులు పండించిన పంటలకు మరింత గిట్టుబాటు ధర లభించి, రైతులకు అదనపు మేలు చేకూరాలన్న లక్ష్యంతో హైదరాబాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలో రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వీటిద్వారా రైతులు కష్టపడి పండించిన వ్యవసాయోత్పత్తులకు మరింత మంచి ధర లభించి, రైతాంగం జీవనం సుసంపన్నం కావాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ఆశయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మూల కారణాలన్నింటినీ గ్రహించి పరిష్కార చర్యలు తీసుకుందని, తరాల తరబడి అనేక భూ వివాదాలకు దారితీస్తున్న పరిస్థితులను మార్చడానికి నూతన భూపరిపాలనా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

ప్రగతి నిరోధకంగా మారిన వీఆర్వోల వ్యవస్థను తొలగించిందని, మూడేళ్ల కష్టపడి ధరణి పోర్టల్‌ను ఆవిష్కరించి, భూరికార్డుల నిర్వహణలో పారదర్శకతను తెచ్చిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి అంగుళం భూమి ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతుందని, అన్నదాతలు ఇకపై నిశ్చింతగా ఉండొచ్చని, ధరణిలో నమోదయిన భూ హక్కులు తొలగించే అధికారం ఎవ్వరికీ లేదని సీఎం కేసీఆర్​ స్పష్టం చేశారు.

బీమాతో నేతన్నకు ధీమా..

చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. చేనేత కార్మికులకు కూడా ఆసరా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలు, రంగులు ప్రభుత్వం అందజేస్తుందని, చేనేత కార్మికుల కుటుంబాలను మరింత ఆదుకోవడానికి రాష్ట్రంలో రైతన్నలకు అమలుచేస్తున్న రైతుబీమా తరహాలో త్వరలోనే చేనేత బీమా పథకం అమలు చేస్తామన్నారు. దురదృష్టవశాత్తు ఏ నేత కార్మికుడైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబం ఖాతాలో రూ.5 లక్షల బీమా సొమ్ము జమవుతుందని, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పస్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.



Next Story