దాహం కోసం వచ్చి.. నీటిలో చిక్కుకుని..

by  |
దాహం కోసం వచ్చి.. నీటిలో చిక్కుకుని..
X

దిశ, కరీంనగర్: కారడవిలో వన్యప్రాణులకు గుక్కెడు నీళ్లు కరువయ్యాయి. అసలే ఎండా కాలం కావడంతో అవి ఇప్పుడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. దాహార్తీ తీర్చుకునేందుకు అల్లాడుతున్న పరిస్థితి తయారైంది. మైళ్ల దూరంలో ఉన్న గ్రావిటీ కెనాల్ వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ నీరు తాగుతున్న క్రమంలో నిండుకుండలా ఉన్న ఆ కెనాల్‌లో బ్యాలెన్స్ తప్పి పడిపోతున్నాయి. ఇప్పటికే పలు మార్లు దుప్పులు పడిపోగా అటవీ అధికారులు వాటిని రక్షించారు. అయితే, అప్పటికే నీటిలో పడి కొన్ని చనిపోయాయి కూడా. వివరాల్లోకెళితే..భూపాలపల్లి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో మహదేవపూర్ ప్రాంతం మీదుగా ప్రవహించే గోదావరి నది వద్దకు వెళ్లి దాహార్తిని తీర్చుకునేవి ఆ ప్రాణులు. కానీ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో దిగువ ప్రాంతంలో గోదావరి నదిలో నీళ్లు లేవు. దాంతో వన్యప్రాణులు దాహార్తిని తీర్చుకోవాలంటే పల్మెల మండలంలోని ఇంద్రావతి నది గోదావరిలో కలిసే దిగువ ప్రాంతానికి లేదా, మేడిగడ్డ బ్యారేజ్ ఎగువ ప్రాంతానికి వెళ్లి దాహార్తిని తీర్చుకోవల్సి వస్తోంది. కాళేశ్వరం, అన్నారం అటవీ ప్రాంతంలో సంచరించే ప్రాణులు కన్నెపల్లి గ్రావిటీ కెనాల్ వద్దకూ వెళ్తున్నాయి.

రక్షణ చర్యలేవి..?

అధికారులు కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్ వరకు దాదాపు 12 కిలో‌మీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఈ కెనాల్‌కు ఇరువైపులా ఎక్కడా కూడా రక్షణ చర్యలు చేపట్టలేదు. దీనివల్ల అల్లంత దూరం నుంచి తాగునీటి కోసం వస్తోన్న వన్యప్రాణులు నేరుగా కెనాల్‌లోకి దిగుతున్నాయి. కెనాల్‌లో నీటి ప్రవాహం వేగంగా ఉండటంతో పాటు అవి తాగేందుకు కూడా అనువుగా లేకపోవడంతో జారి పడి కొట్టుకుపోతున్నాయి. అటవీ అధికారులు ఈ కెనాల్‌కు ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని నిర్మాణ కంపెనీని ఆదేశించారు. కానీ, ఇందుకు సంబంధించిన చర్యలు ఇంత వరకు ప్రారంభం కాలేదు.

వాగులు, వంకలు ఎండిపాయె..

గతంలో వన్యప్రాణులు అటవీ ప్రాంతాల మీదుగా ప్రవహించే వాగులు వంకల్లో ప్రవహించే నీటిని తాగి జీవించేవి. అయితే, ఇటీవల కాలంలో ఎండల తీవ్రతకు వాగులు, వంకల్లో నీరు లేని పరిస్థితే తయారైంది. దీంతో అడవి జంతువులు నీటి కోసం మైళ్లకు మైళ్లు నడుచుకుంటూ వెళ్తున్నాయి. అటవీ అధికారులు కూడా వన్యప్రాణుల దాహార్తి కోసం ప్రత్యేకంగా నీటి గుంతలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంది. గతంలో ఇలాంటి చర్యలు చేపట్టినప్పటికీ అవి ఇప్పుడు కానరావడం లేదు. అంతేకాకుండా రెండు దశాబ్దాల కిందట అడవుల్లో పారే వరద నీటిని ఎక్కడికక్కడ నిలిపాలన్న సంకల్పంతో చెక్ డ్యాంలు కూడా నిర్మించారు. ఈ చెక్ డ్యాం నిర్మాణాల వల్ల అటవీ భూమి కోతకు గురికాకుండా ఉండటంతో పాటు నీరు నిలువ ఉండటం వల్ల భూగర్భ జలాలు పెరిగి చెట్లకు నీరందుతుందని భావించారు. అలాగే వన్య ప్రాణులు సైతం ఈ నీటిని తాగే అవకాశం ఉండేది. కానీ, ఈ చెక్ డ్యాంలు కూడా నేడు నిరుపయెగంగా మారిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అడవుల్లోనే నీటి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వీటికి నీరందించేందుకు ప్రత్యేకంగా నీటి గుంతల నిర్మాణం చేయడంతో పాటు ఇతరత్రా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

Tags: water problems, canals, no safety actions, wild animals, bhoopalpally, medaram



Next Story

Most Viewed