తెలంగాణ విముక్తి కోసం కరీంనగర్‌ సమర యోధులు.. చెక్కు చెదరని ఆధారాలు

by  |
తెలంగాణ విముక్తి కోసం కరీంనగర్‌ సమర యోధులు.. చెక్కు చెదరని ఆధారాలు
X

దిశ, కాటారం: నిజాం నిరంకుశ పాలన అంతం చేసేందుకు మంథని, దామరకుంట, మహాదేవపూర్ ప్రాంతానికి చెందిన ఎందరో సమర యోధులు గ్రామాన్ని కుటుంబాలను వదిలి అజ్ఞాత బాట పట్టారు. సాయుధులుగా తిరుగుబాటు జెండాను ఎగురవేశారు. ప్రజలను చైతన్య వంతులను చేస్తూ గ్రామాల్లో పర్యటిస్తూ రజాకర్ల మెడలు వంచడానికి అలుపెరుగని పోరాటం చేశారు. ఇప్పటి పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన గులుకోట శ్రీరాములు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారు. రఘునాథరావు కాచే జిల్లాలో తొలి సత్యాగ్రహ వాదిగా నిజాము వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ఈ ప్రాంతంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలో దామరకుంటకు చెందిన రాగం వెంకటయ్య, ఐత చిన్న పోచిరెడ్డి, పెద్ద పోచిరెడ్డి, ఐత రాజిరెడ్డి, బాసాని బక్కరాజయ్య, కోడిపల్లి వెంకటయ్యలతో పాటు ఎందరో యోధులు సత్యాగ్రహం చేసి విముక్తి కోసం పాటుపడ్డారు.

సాయుధ పోరుబాట..

రావి నారాయణరెడ్డి స్ఫూర్తితో మంథనికి చెందిన గులుకోట శ్రీరాములు నేతృత్వంలో మంథని, మహదేవపూర్ ప్రాంతాలకు చెందిన పనకంటి కిషన్ రావు, సువర్ణ ప్రభాకర్, చొప్పకట్ల చంటయ్య, రాంపెల్లి కిష్టయ్య దామోదర్ థామస్, శివనాద్రి శంకరయ్య గుప్త, నరహరి, ఎలిశెట్టి సీతారాంతో పాటు చాలా మంది సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. స్వామి రామానంద తీర్థ పిలుపు మేరకు సత్యాగ్రహ ఉద్యమంలో రఘునాథ రావు కాచే ఆధ్వర్యంలో పి.గణపతి రావు, రామగుండం రాజేశ్వరరావు, రాజన్న సార్‌తో పాటు చాలా మంది వీరులు నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. కరీంనగర్, ఆదిలాబాద్ జైళ్లలో శిక్ష అనుభవించారు. దామరకుంటకు చెందిన ఐత చిన్నపోచిరెడ్డిని కాటారం మండలంలోని ధన్వాడ గ్రామం వద్ద రజాకార్ల సైన్యం చంపడం అప్పట్లో విషాదం నింపింది.

మహారాష్ట్రలోని చాందాలో క్యాంపు శిక్షణ..

మంథనికి చెందిన గులుకోట శ్రీ రాముల బృందం మహారాష్ట్రలోని చంద్రాపూర్ (చాంద)లో సాయుధ శిక్షణ పొందారు. అప్పుడు చంద్రపూర్ కేంద్రంగా ఉన్న జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిజాం పోలీస్ అధికారులపై గెరిల్లా దాడులు చేసి సంచలనం సృష్టించారు. మంథని మహాదేవపూర్ తాలూకాల్లో సాయుధ కార్యకలాపాలు నిర్వహించారు. 1948లో గోదావరి దాటి నిజాం సంస్థాన గ్రామాలైన కాళేశ్వరం, మహాదేవపూర్, దామరకుంట పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి నిజాం ప్రభుత్వానికి సవాల్ విసిరారు. దామరకుంటలో కలెక్టర్ పర్యటనకు వెళ్లిన తహసీల్ హమ్లాలోని అధికారులపై దాడి చేసి చంపిన సంఘటనతో నిజాం సర్కార్ గడగడలాడింది. ఈ దాడుల స్ఫూర్తితో మంథని, మహాదేవపూర్ తాలూకాల్లో నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించారు. కాళేశ్వరంలోని ఔట్ పోస్టుపై దాడి జరిగినప్పుడు గులుకొట శ్రీరాములు కాలికి గాయం తూటా గాయం అయింది. సాయుధ పోరుబాట పట్టాలని నిర్ణయించిన గులుకోట శ్రీరాములు చాందా అటవీ ప్రాంతాన్ని ట్రైనింగ్ క్యాంప్‌గా ఏర్పాటు చేశారు. కొంతకాలం తరువాత ఈ క్యాంపును ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని ఉద్యమకారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా మార్చారు. కేవి నర్సింగరావు క్యాంపు ఇన్‎చార్జీగా వ్యవహరించగా, పీవీ నరసింహరావు రాజకీయ శిక్షణలు ఇచ్చేవారు.

పోరుబాట చిహ్నం..

1948 సెప్టెంబర్ 17న భారత సైనిక చర్యతో దిగి వచ్చిన నిజాం నవాబు తలవంచడంతో హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వంలో విలీనమైంది. తెలంగాణ విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటానికి చిహ్నంగా మండలంలోని దామెరకుంట, ఒడిపిలవంచ గ్రామాల్లో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 1972లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ స్తూపాలను ఏర్పాటు చేసింది.


Next Story

Most Viewed