ప్రియుడు తన తండ్రిని కొట్టాడనే బాధతో వాలంటీర్ ఆత్మహత్య

by srinivas |
ప్రియుడు తన తండ్రిని కొట్టాడనే బాధతో వాలంటీర్ ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో: బాధ్యాతయుతమైన పోలీసు కానిస్టేబుల్‌గా పని చేసే వ్యక్తి.. పలువురికి ఆదర్శంగా నిలవాల్సింది పోయి.. తనకు పెళ్లైనా ఆ విషయాన్ని దాచిపెట్టి ఇద్దరితో ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం తెలిసిన యువతి తన తల్లిదండ్రులతో కలిసి పెద్ద మనుషుల్లో పంచాయతీ పెట్టింది. పంచాయితీలో తన తండ్రిని ప్రియుడు కొట్టడంతో యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన గురువారం శ్రీకాళహస్తిలోని దక్షిణ కైలాస్‌ నగర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తెనాలికి చెందిన సాంబశివరావు శ్రీకాళహస్తిలోని దక్షిణ కైలాస్‌నగర్‌లో స్థిరపడ్డారు.

ఆయన కుమార్తె ఉమామహేశ్వరి (24) తొమ్మిదో వార్డు వాలంటీర్ పనిచేస్తోంది. తొట్టంబేడు మండలం చేమూరుకు చెందిన కానిస్టేబుల్‌ ప్రసాద్‌ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రొటోకాల్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ ఇటు ఉమామహేశ్వరితో.. అటు మరో యువతితోను ప్రేమ వ్యవహారం నడిపాడు. కానిస్టేబుల్‌ ప్రసాద్‌కు ఇంతకుముందే పెళ్లి జరిగినట్లు మహేశ్వరికి తెలియటంతో.. తన తల్లిదండ్రులతో కలిసి పట్టణంలోని భరద్వాజ తీర్థం వద్ద పంచాయితీకి ఉమామహేశ్వరి వెళ్లింది. అక్కడే ప్రసాద్‌కు, ఉమామహేశ్వరికి వాగ్వాదం జరగ్గా.. ఆమె తండ్రిపై ప్రసాద్‌ చేయి చేసుకున్నాడు.

దీంతో ఉమామహేశ్వరి అవమానంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఉరివేసుకున్నట్లు గురువారం ఉదయం బాధితురాలి కుటంబ సభ్యులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుపై పట్టణ రెండో సీఐ భాస్కర్‌ నాయక్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ప్రసాద్‌ పరారీలో ఉన్నట్లు అతని ఆచూకి కనిపెట్టి అరెస్టు చేస్తామని సీఐ భాస్కర్ స్పష్టం చేశారు.



Next Story

Most Viewed