వరవరరావు విడుదలకు చొరవ తీసుకొండి

by  |
వరవరరావు విడుదలకు చొరవ తీసుకొండి
X

దిశ, న్యూస్ బ్యూరో:
కవి, ప్రజాస్వామిక హక్కుల నాయకుడు వరవరరావు తీవ్ర అనారోగ్యంతో మహారాష్ట్రలోని జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన విడుదలకు చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ రచయితలు విజ్ఞప్తి చేశారు. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యే నాటికే వీవీ పలు రకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారని, కేసుకు సంబంధించిన న్యాయాన్యాయాలతో సంబంధం లేకుండా తెలంగాణ సమాజానికి అమూల్యమైన ఆయన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే అంశాన్ని గుర్తిస్తారని 27 మంది రచయితలు ఆ లేఖలో ప్రస్తావించారు.అనుక్షణం పహారా మధ్య జరుగుతున్న చికిత్స స్థితి ఏంటో తెలియడం లేదని, ఆయన కుటుంబం మునుపెన్నడూ లేనంతగా గందరగోళం, ఆందోళన, ఆవేదనలో ఉన్నదని వివరించారు.

“నిరంతర ఉద్యమ వాతావరణంలో జీవించే ఒక పోరాటశీలి మానసికస్థితి, మనుగడ ఎలా ఉంటుందో తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా వ్యవహరించిన మీకంటే ఎవరికి బాగా తెలుస్తుంది” అని ఆ లేఖలో పేర్కొన్నారు. వీవీతో ఏకీభావం ఉండకపోవచ్చుగానీ ఆయన ప్రాణాలను సంరక్షించుకోవాల్సిన ఏకాభిప్రాయంతో ఉన్నారనే అనుకుంటున్నట్టు తెలిపారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో నిర్బంధంలో ఉన్న వరవరరావుని స్వయంగా వెళ్ళి కలిసి సంఘీభావాన్ని ప్రకటించిన విశాల ప్రజాస్వామ్య ప్రియులుగా ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో స్వయంగా చొరవ తీసుకుని మహారాష్ట్ర ముఖ్యమంత్రితో, కేంద్ర హోంమంత్రితో మాట్లాడి ఆయన విడుదలకు చొరవ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు.

“మీరు గట్టిగా పూనుకుంటే ఇది సులభసాధ్యమే. మాకు ఆ నమ్మకం ఉంది. మీ తక్షణ స్పందనను ఆశిస్తున్నాం” అని దేవిప్రియ, అంపశయ్య నవీన్, కె.శివారెడ్డి, నందిని సిధారెడ్డి, ఓల్గా, కాళీపట్నం రామారావు, ఎన్.గోపి, కాత్యాయని విద్మహే, కె.శ్రీనివాస్, మృణాళిని, అల్లం రాజయ్య, పాపినేని శివశంకర్, నలిమెల భాస్కర్, ఎండ్లూరి సుధాకర్, గోరటి వెంకన్న, వాసిరెడ్డి నవీన్.. ఇలా మొత్తం 27 మంది రచయితలు ఆ లేఖలో సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.

Next Story

Most Viewed