మురుగులోనే పల్లె జీవనం.. కానరాని స్వచ్ఛత!

by  |
మురుగులోనే పల్లె జీవనం.. కానరాని స్వచ్ఛత!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రతినెలా రూ.339 కోట్లు, వారం వారం స్వచ్ఛత. మండల స్థాయి అధికారుల పర్యవేక్షణలో ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు.. అంటూ మంత్రులంతా ఊదరగొట్టారు. పల్లె ప్రగతి కింద చీపుర్లు, తట్టలు చేతబట్టి పనులు చేశారు. ఇంత చేసినా గ్రామాల్లో మార్పులు రాలేదు. మురుగు నీటిలోనే ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం నివేదికలో వెల్లడించింది. మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తుండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని పేర్కొంది. రాష్ట్రంలోని గ్రామాల్లో 38 శాతం ఇండ్లకు డ్రైనేజీ వ్యవస్థ లేదని నిర్ధారించింది.

32.13 లక్షల ఇండ్లకు.. మురుగు కాల్వలు లేవు

రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలో 83,03,612 గృహాలు ఉన్నట్లు నివేదికలో వెల్లడించారు. ఇందులో 32,13,276 ఇండ్లకు మురుగు నీటి వ్యవస్థ లేదని, దీంతో డ్రైనేజీ నీరంతా ఇండ్ల పరిసరాలు, రోడ్లపై నిల్వ ఉంటుందని, ఈ పరిస్థితి రోగాలకు కారణమవుతున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అధ్వానంగా ఉందని తేల్చారు. మొదటి స్థానాల్లో ములుగు జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉన్నట్లు గుర్తించారు.

ములుగు జిల్లాలో 78.9 శాతం ఇండ్లకు డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఆ తర్వాత మహబూబాబాద్​ జిల్లాలో 77.7, కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లాలో 75.4, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలో 74, వరంగల్​ రూరల్​ జిల్లాలో 71.5, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 62.9, నాగర్​ కర్నూల్​ జిల్లాలో 61.7, ఆదిలాబాద్​ జిల్లాలో 61.5, జనగాం జిల్లాలో 60.6, సూర్యాపేట జిల్లాలో 60 శాతం ఇండ్లకు డ్రైనేజీ వ్యవస్థ అసలే లేదు. హైదరాబాద్​ జిల్లా పరిధిలో 1.1, మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో 5.5, రంగారెడ్డి జిల్లాలో 17.4 శాతం మాత్రమే డ్రైనేజీ లేదు. మిగిలిన జిల్లాలో సగటున 23 నుంచి 56 శాతం వరకు డ్రైనేజీ వ్యవస్థ, మురికి నీరు వెళ్లేందుకు ఏర్పాట్లు లేవని నివేదికల్లో వెల్లడించారు.

నిధులు ఉత్తిమాటేనా..?

గ్రామాల అభివృద్ధి కోసం కోట్ల నిధులు విడుదల చేస్తున్నామనే ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది. గ్రామాల్లో మురుగు నీటి వ్యవస్థ కూడా సరిగా లేకపోవడం దీనికి అద్దం పడుతోంది. మొత్తం 38.7 శాతం ఇండ్లకు డ్రైనేజీ లేదు. వచ్చే నిధులు నిర్వహణకు, జీతాలకే సరిపోవడం లేదని గ్రామ పంచాయతీ పాలకవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పారిశుధ్య పనులు చేసేందుకు చిల్లిగవ్వ ఉండటం లేదని వెల్లడిస్తున్నారు.



Next Story