రాములమ్మ భయపడదు

by  |
రాములమ్మ భయపడదు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ‘‘కేసీఆర్ దొర నాపై ఎన్ని కేసులు పెట్టించినా ఈ రాములమ్మ భయపడదు, అవన్నీ అక్రమ కేసులే’’ . కేసీఆర్ తొమ్మిదేళ్ళ తర్వాత కూడా నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అని బీజేపీ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో 2012లో అనుమతి లేని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు విజయశాంతిపై కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో భాగంగా గురువారం మధ్యాహ్నం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కోర్టుల పట్ల తనకు గౌరవం ఉందని, వాస్తవాల ఆధారంగా తీర్పు వెలువడుతుందని, అందుకే కోర్టుకు హాజరయ్యాయనని ఆమె తెలిపారు.

అనంతరం బైటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, “2012లో నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను. ఆ పార్టీ తరఫునే ప్రచారం చేశాను. పార్టీ అధినేతగా నిర్దిష్టంగా ఒక సభకు పోలీసుల నుంచి అనుమతి ఉందా లేదా అని చూసుకోవాల్సింది ఆయనే. కానీ ఆ సభకు అనుమతి లేదంటూ నాపైన కేసులు నమోదయ్యాయి” అని విజయశాంతి వివరించారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా తనపైన కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో తనలాంటివారంతా రోడ్లపై ఉన్నారని, కానీ ఉద్యమ నాయకుడిగా చెప్పుకునే కేసీఆర్ మాత్రం ఇంట్లో కూర్చునే తరహా ఉద్యమాలు చేశారని ఆమె ఆరోపించారు. తనపైన అక్రమంగా ఎన్ని కేసులు పెట్టినా ఆయనకు భయపడే ప్రసక్తే లేదని, రాములమ్మకు అలాంటి భయాలు ఉండవన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనపైన కేసీఆర్ ఇలాంటి కేసులు పెట్టిస్తున్నారని పేర్కొన్నారు.

Next Story

Most Viewed