పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ.. చంద్రబాబుపై సాయిరెడ్డి ఫైర్

by  |
ycp mp vijaya sai reddy
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. విజయదశమినాడు సైతం వదలకుండా ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల్లో ఒకటైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ పథకాన్ని అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తుండగా చంద్రబాబు మాత్రం దాన్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. మధురవాడ ఎంఎస్ఆర్ లేఅవుట్‌లో బట్టర్ ఫ్లై థీమ్ పార్క్, మల్కాపురం ఏరియాలో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లను నిర్మించి ఇస్తామనే హామీని జగన్ సర్కార్ అమలు చేస్తోందని దీన్ని అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని..చివరకు న్యాయస్థానాలను సైతం అడ్డుగా పెట్టుకుంటుందని మండిపడ్డారు.

ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన పనులు చేస్తోందని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తులల పేర్లతోనూ ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి పిటిషన్లు వేయించిందని విజయసాయి రెడ్డి ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లను అందించేందుకు వైసీపీ ఎంత దూరమైనా వెళ్తుందని తెగేసి చెప్పారు. టీడీపీ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాన్ని ఎన్నోరోజులు అడ్డుకోలేదన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడమంటే అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపడంలాంటిదేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మబ్బులు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పేదలకు ప్రభుత్వ పథకాలు దక్కకుండా అడ్డుపడుతున్న చంద్రబాబుపైనా…టీడీపీపైనా ప్రజలు తిరుగుబాటు చేసేరోజు దగ్గరలోనే ఉందని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి హెచ్చరించారు.


Next Story