అందుకోసం ఆరేళ్లుగా పోరాటం!

by  |
అందుకోసం ఆరేళ్లుగా పోరాటం!
X

దిశ, వెబ్‌డెస్క్: 2013లో ‘ఫర్ సేల్’ అనే పేరుతో మలయాళంలో ఒక సినిమా విడుదలైంది. తన చెల్లెలు దారుణంగా అత్యాచారానికి గురవడం చూసిన ఓ మహిళ, అది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవడమే ఈ చిత్ర కథాంశం. అందులో దారుణంగా అత్యాచారానికి గురైన చెల్లెలి పాత్రను పోషించింది సోనా అనే నటి. అప్పుడు ఆమెకు 14 ఏళ్లు. అయితే రేప్ సీన్ బాగా పండటం కోసం ఇబ్బంది కలిగించేలా చిత్రీకరణ చేయాల్సి వచ్చింది. అందుకే వాటిని షూటింగ్ చేసేటపుడు చిన్న హ్యాండ్ కెమెరాతో ప్రైవేటుగా రికార్డ్ చేశారు. అందులో బాగా వచ్చిన బిట్‌లను సినిమాలో ఉపయోగించుకుని ఆ తర్వాత ఫుటేజీని పూర్తిగా డిలీట్ చేస్తామని ఆ సినిమా డైరెక్టర్ సతీష్ అనంతపురి, నిర్మాత ఆంటో కడవెల్లిలు సోనాకు మాట ఇచ్చారు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది.

సంవత్సరం అయ్యాక, అంటే 2014లో ఆ హ్యాండ్ కెమెరాలో చిత్రీకరించిన ఫుటేజీ మొత్తం ఎలాంటి ఎడిట్‌లు లేకుండా యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ఈ విషయంపై సోనా కుటుంబం వెంటనే పోలీసుల వద్దకు వెళ్లింది. అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఆ ఫుటేజీ యూట్యూబ్‌ నుంచి తొలగించినప్పటికీ పోర్న్ సైట్లలోకి పాకడంతో తొలగించడం అసాధ్యంగా మారింది. ఇక ఆ ఫుటేజీని ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి సోనా గత ఆరేళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉంది. ఇటీవల జరిగిన ‘విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్’ వారు నిర్వహించిన ‘రెఫ్యూజ్ ద అబ్యూజ్’ క్యాంపెయిన్‌లో భాగంగా సోనా ఈ అనుభవాన్ని పంచుకున్నారు. ఇది కూడా సైబర్ క్రైమ్ అని ఆమె పేర్కొన్నారు.

2014లో, 2016లో ఈ విషయం గురించి పోలీసులను ఆశ్రయించినా.. ఈ ఫుటేజీని ఇంటర్నెట్‌లో లీక్ అవడానికి బాధ్యులైన నిర్మాత, దర్శకుడు, ఎడిటర్‌ల మీద కేసులు పెట్టినా తనకు న్యాయం జరగలేదని, ఇప్పటికీ ఆ ఫుటేజీ ఇంటర్నెట్‌లో ఉందని ఆమె బాధపడ్డారు. ఫుటేజీని తొలగించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఏదో ఒక చోట అవి ప్రత్యక్షమవుతున్నాయని ఆమె తెలిపారు. అందుకే ఇలాంటి వారి మీద పోస్కో చట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆమె కోరుతున్నారు. అంతేకాకుండా ఇలా సైబర్ బుల్లీయింగ్ జరగకుండా ఉండాలంటే ముందు ఎవరి మాట నమ్మొద్దని, చాలా నమ్మకంగా మోసం చేయగల సమర్థులు ఉన్నారని ఆమె సలహా ఇచ్చారు. ఆమె ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్న తర్వాత, సోనాకు సాయం చేయడానికి కేరళ మహిళా కమిషన్, ఐటీ సెల్ ముందుకొచ్చాయి. వారంతా కృషి చేసి ఆ ఫుటేజీని ఇంటర్నెట్‌ నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆశిద్దాం!


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed