రాత్రి కర్ప్యూ సరే… పగటిపూట నియంత్రణలేవి?

by  |
రాత్రి కర్ప్యూ సరే… పగటిపూట నియంత్రణలేవి?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాత్రివేళ కర్య్పూ పెట్టి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని, కానీ పగటిపూట ఎలాంటి నియంత్రణలు లేకుండా ఈ ప్రభుత్వం ఏం సాధించదలుచుకుందో ఏమిటో అర్ధం కావడం లేదని మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో కరోనా ఉధృతి ఎక్కువైందన్నారు. మంగళవారం ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆమె విరుచుకుపడ్డారు. ఏడాది క్రితం ఏం తప్పులు జరిగాయో అవే ఇప్పడు పునారావృతం అవుతున్నందునే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చిందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించడం లేదని ధ్వజమెత్తారు. గుణపాఠం కూడా నేర్చుకోవడం లేదని ఆరోపించారు.

తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోందన్నారు. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, అప్పడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించిందన్నారు. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదన్నారు. విద్యా సంస్థలను మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు గుంపులుగా తీరుగుతున్న జనాన్ని కట్టడి చేయడం, బెడ్ల కొరత గురించి న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానం లేదన్నారు. సరైన సమాచారం లేని ప్రభుత్వ నివేదికల్లోని లోపాలపై హైకోర్టు నిలదీసిందని అయినా మార్పు రాకపోవడం సిగ్గుచేటన్నారు.

కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్ అంతకు ముందు మాస్క్ లేకుండా సమీక్షలు నిర్వహించి సభల్లో పాల్గొన్న ఫొటోలు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొడుతున్నాయని, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సైతం అధినేత బాటలోనే నడుస్తూ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారారని విజయశాంతి ధ్వజమెత్తారు. ఇప్పటికైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజలను కాపాడాలని సూచించారు.

Next Story