భద్రత లేని ప్రయాణం..తీరుమారని ప్రభుత్వం !

by  |
భద్రత లేని ప్రయాణం..తీరుమారని ప్రభుత్వం !
X

దిశ, న‌ల్లగొండ‌ : రక్షణ గోడలు, ఫెన్సింగ్ లేనటువంటి చెరువు కట్టలు, కాలువల మీదుగా ప్రయాణం వాహనదారులకు ప్రాణసంకటంగా మారింది. తరచూ ప్రమాదాలకు గురవుతూ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలో గ‌త ప‌ది రోజుల్లోనే జ‌రిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు..బాధితుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. ఏదైనా ప్రమాదం జ‌రిగిన‌ప్పుడు మాత్రమే హడావిడి చేసే అధికారులు..ఆ త‌రువాత రక్షణ చర్యల గురించి ప‌ట్టించుకోవడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి.

ఇటీవల వ‌లిగొండ మండ‌లం వేముల‌కొండ‌లో చోటుచేసుకున్న ప్రమాదమూ ఈ అంశాలకు బలం చేకూరుస్తోంది. వ్యవసాయ పనులకు కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌..చెరువు క‌ట్ట ఎక్కుతున్న క్రమంలో ఎదురుగా వ‌స్తోన్న వాహ‌నాన్ని త‌ప్పించ‌బోయి అదుపు త‌ప్పడంతో ట్రాలీ మూసీ కాలువ‌లో ప‌డింది. ఈ ఘటనలో 18 మంది కూలీలు మృతి చెంద‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆ సంఘ‌ట‌న జ‌రిగిన రోజు సాయంత్రం వ‌ర‌కు వేముల‌కొండ‌లోనే ఉండి హడావిడి చేసిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి మ‌ళ్లీ ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోనేలేదని సమాచారం. ఈ ఘటన మరువకముందే స‌రిగ్గా వారం రోజుల కింద‌ట రామ‌న్నపేట మండ‌లం, స‌ర్నేనిగూడెం గ్రామ స‌ర్పంచ్ ధ‌ర‌ణిరాణి భ‌ర్త మధు, ఆమె కుమారుడు మ‌ణికంఠ‌, డ్రైవ‌ర్ న‌న్నూరి శ్రీ‌ధ‌ర్‌లు కారులో వెల్లంకి చెరువు క‌ట్టపై నుంచి వెళ్తుండగా.. ప్రమాద‌వశాత్తు కారు చెరువులోకి దూసుకెళ్లి ఆ ముగ్గురూ జ‌ల‌స‌మాధి అయ్యారు. పీఏప‌ల్లి మండ‌లం, వ‌డ్డెర‌ప‌ల్లి గ్రామానికి చెందిన రఘు, ఆయ‌న భార్య, కుమార్తె కీర్తి, కుమారుడితో క‌లిసి పెండ్లికి వెళ్లి వ‌స్తుండ‌గా మండ‌లంలోని దుగ్యాల వ‌ద్ద వారు ప్రయాణిస్తున్న కారు టైరు ప‌గిలిపోవ‌డంతో అదుపుతప్పి ఏఎమ్మార్పీ కాలువ‌లో ప‌డిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెంద‌గా..మృతుడి కూమారుడిని స్థానికులు ర‌క్షించారు. కేవ‌లం ప‌ది రోజుల వ్యవధిలోనే ఆరుగురు జ‌ల‌స‌మాధి కావ‌డం వెనక అడుగడుగునా..ప్రభుత్వ నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

ప్రమాద‌మ‌ని తెలిసిన ప‌ట్టించుకోని అధికారులు..

రామ‌న్నపేట మండ‌లంలోని 24 గ్రామాలు, 15 ఆవాస గ్రామాల ప్రజ‌లు ఈ చెరువు క‌ట్టల‌పై నుంచే రాక‌పోక‌లు సాగిస్తున్నారు. వీటిపై బీటీ రోడ్లయితే వేసిన ప్రభుత్వం..రక్షణ గోడలు నిర్మించడం మరిచింది. కనీసం హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. దీంతో ఆ క‌ట్టల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులు ఏ మాత్రం అలసత్వం వహించినా..అజాగ్రత్తగా వాహనాన్ని నడిపినా..ప్రమాదాల బారినపడుతున్నారు. అయిన‌ప్పటికీ ఇటు పాల‌కులు గానీ, అటు అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు కట్టలపై ఇరువైపులా తక్షణమే రక్షణ గోడలను నిర్మించడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని కోరుతున్నారు.

Next Story

Most Viewed