వేతనజీవి నెత్తిన కరోనా పిడుగు

by Harish |
వేతనజీవి నెత్తిన కరోనా పిడుగు
X

దిశ, సెంట్రల్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. మన దేశం కూడా మార్చి 25నుంచి అదే బాటలో నడిచింది. అంచలంచెలుగా ఆంక్షల్లో సడలింపులు ఇస్తూ నాలుగుసార్లు లాక్‌డౌన్ పొడిగించారు. మరో దఫా పొడిగించే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. సమీప భవిష్యత్తులోనూ కొవిడ్-19 వ్యాప్తికి ముందు పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అన్ని సంస్థలు ఆర్థికభారం తగ్గించుకొనే పనిలో పడ్డాయి. ఇందుకోసం కొన్ని సంస్థలు ఏకంగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మరికొన్ని సంస్థలు వేతనాల్లో కోత పెడుతున్నాయి. ఇది ఏ ఒక్క రంగానికో సంస్థకో పరిమితం కాలేదు. దాదాపు అన్ని సంస్థలు అదే బాటలో ఉన్నాయి.

బుక్ మైషో 20శాతం కోత

రెండు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పడప్పుడే తెరుచుకొనే పరిస్థితి లేదు. తెరుచుకున్నా 100శాతం సీటింగ్ సౌకర్యం కల్పిస్తారో లేదో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రముఖ బుకింగ్ సైట్ ‘బుక్ మైషో’ ఆర్థిక భారం తగ్గించే పనిలో పడింది. ఇందుకోసం సంస్థలోని 20శాతం ఉద్యోగాల్లో కోత పెట్టనున్నట్లు ప్రకటించింది. బుక్‌మైషోకు ప్రస్తుతం 1450మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 270మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఇప్పటికే ఉద్యోగులకు నోవర్క్-నోపేను బుక్‌ మైషో వర్తింపజేస్తుంది. ఉద్యోగులు కోల్పోయిన, సెలవులో ఉన్న వారికి వైద్య, బీమా, గ్రాట్యూటీ తదితర అలవెన్సులను ఇస్తామని బుక్ మైషో సీఈవో ఆశిష్ హేంరజని తెలిపారు. కొందరు ఉద్యోగులు జీతాల్లో 10 నుంచి 50 శాతం వరకు కోత విధించుకున్నారని, బోనస్‌లనూ వదులుకున్నట్టు ఆయన తెలిపారు.

క్యాబ్ సంస్థల్లో ఉద్యోగాలు, వేతనాల్లోనూ

ఆన్‌లైన్ ఆటో పోర్టల్ కార్‌దేఖో ఉద్యోగుల తొలగింపుతోపాటు వేతనాల్లో కోత కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థకు మొత్తం 5వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 200మంది తొలగించనున్నారు. వచ్చే మూడు నెలల కాలానికి వార్షికాదాయాన్ని బట్టి కోత కూడా పెట్టనుంది. రూ.2.5లక్షల-రూ.5లక్షల వరకు 12శాతం, రూ.5లక్షల-రూ. 15 లక్షల వరకు 15శాతం, రూ.15లక్షల-రూ.40లక్షల వరకు 20 శాతం, 40లక్షలపైన ఆదాయం గల వారి వేతనంలో 22.5శాతం కోత విధించనున్నారు. మరోవైపు ఇండియాలో 600మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ ప్రకటించింది. ఇది మనదేశంలో ఆ సంస్థకు ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 25శాతానికి సమానం. డ్రైవింగ్ సపోర్ట్, లీగల్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉబర్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగిస్తున్నారని, అందులోభాగంగానే ఇండియాలో కూడా అమలు చేశారని ఉబర్ దక్షిణాసియా అధ్యక్షుడు ప్రదీప్ పరమేశ్వరన్ తెలిపారు. ఇప్పటివరకు 6,700 మంది ఉద్యోగులను
ఉబర తొలగించింది. మరో క్యాబ్ సర్వీస్ కంపెనీ ఓలా కూడా ఇదే బాటలో వెళ్తున్నది. ఆ సంస్థలో 35 శాతానికి సమానమైన 1,400మంది ఉద్యోగులను తొలగించింది.

టీవీఎస్‌లో వేతనాల కోత

లాక్‌డౌన్‌తో రెండు నెలలుగా మోటార్ సైకిళ్ల వాహనాల అమ్మకాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ టీవీఎస్ మోటార్ సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మే నుంచి వచ్చే ఆరు నెలలపాటు ఉద్యోగుల్లో జీతాల్లో 20శాతం కోత పెడుతున్నట్లు ప్రకటించింది. కార్మికులకు మినహాయింపు ఇచ్చింది. వర్క్‌మెన్ స్థాయిలో ఎలాంటి కోత ఉండదని, జూనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ఉన్నవారి జీతంలో 5శాతం, సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉన్నవారికి 15 నుంచి 20 శాతం కోత విధించనున్నారు.

సీఈవోలకూ తప్పలేదు

కరోనా వల్ల ఏర్పడ్డ నష్టాలను అధిగమించేందుకు ఖర్చులను తగ్గించే చర్యలను టాటా గ్రూప్ మేనెజ్‌మెంట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ సహా టాటా గ్రూప్ కంపెనీల సీఈవోల వేతనంలో 20 శాతం కోత విధించడానికి నిర్ణయించారు. కంపెనీ నిర్ణయాన్ని అనుసరించి టాటా మోటార్స్, టాటా స్టీల్స్, టాటా పవర్, టాటా ఇంటర్‌నేషనల్, టాటా క్యాపిటల్, ట్రెంట్, వోల్టాస్ సీఈవోలు, ఎండీలు తమ జీతాలను తగ్గించుకోనున్నారు. బోనస్‌లను కూడా వదులుకోనున్నారు.

13.5కోట్ల ఉద్యోగాలకు ముప్పు

కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడం వల్ల దేశంలో 13.5కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని అంతర్జాతీయ మేనెజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ ఆర్థర్ డీ లిటిల్ అంచనా వేసింది. ఈ పరిణామాలతో వినియోగదారుల ఆదాయం, వ్యయం, పొదుపుపై ప్రభావం ఉంటుందని, తలసరి ఆదాయం క్షీణించడమే కాకుండా జీడీపీ ప్రభావానికి గురవుతుందని పేర్కొంది. జీడీపీ మందగమనంతో ఉద్యోగాలు, పేదరిక నిర్మూలన, తలసరి ఆదాయం, నామమాత్రపు జీడీపీపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుతం ఉన్న నిరుద్యోగిత రేటు 7.6శాతం నుంచి 35శాతానికి పెరిగే అవకాశం ఉందని, స్థూలంగా 17.3కోట్ల మంది నిరుద్యోగులుగా మారే ప్రమాదం ఉంది. ఈ పరిణామాలతో 12కోట్ల మంది పేదరికంలోకి జారుకుంటారని, వీరిలో 4కోట్ల మంది నిరుపేదలుగా మారే అవకాశం ఉంది.



Next Story