వరవరరావుకు తీవ్ర అనారోగ్యం

by  |
వరవరరావుకు తీవ్ర అనారోగ్యం
X

దిశ, న్యూస్ బ్యూరో: భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి మహారాష్ట్ర జైల్లో ఉన్న పౌరహక్కుల కార్యకర్త వరవరరావు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వచ్చిన వార్తలు పాక్షిక సత్యం మాత్రమేనని, విషమంగా ఏమీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో సోడియం, పొటాషియం లెవల్స్ తగ్గిపోయాయని, ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గురువారం ఉదయం జైలు నుంచి ఫోన్ ద్వారా భార్యతో మాట్లాడారని, కానీ గొంతు చాలా తక్కువ స్వరంతో ఉండి ఆనారోగ్యంతో ఉన్నట్లు తెలియజేస్తోందని పేర్కొన్నారు.

మే నెల చివరి వారంలో కూడా ఇదే తరహాలో అనారోగ్యం వచ్చి కుప్పకూలిపోతే ముంబయిలోని జేజే ఆసుపత్రిలో మూడు రోజుల పాటు చేర్చాల్సి వచ్చిందని, ఇప్పుడు కూడా మళ్ళీ ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం ఏర్పడిందని, అయితే విషమంగా ఉందంటూ వస్తున్న వార్తలతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ జైలు అధికారులే ఫోన్ చేసి చెప్పారనేది కరెక్టు కాదని కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చారు. ఆరోగ్య ఇబ్బందికరంగా ఉన్నందునే ఆసుపత్రికి తరలించాల్సిందిగా చాలా రోజుల నుంచి న్యాయస్థానం మొదలు భారత రాష్ట్రపతి వరకు అనేక విజ్ఞప్తులు చేస్తూ ఉన్నామని, కానీ ఇప్పటికీ సానుకూల స్పందన రాలేదని బంధువు ఒకరు తెలిపారు. ఇప్పటికైనా ఆయన అనారోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలని కోరారు.



Next Story

Most Viewed