కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న ఉత్తరాఖండ్, యూపీ సీఎంలు

by  |
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న ఉత్తరాఖండ్, యూపీ సీఎంలు
X

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌లు అసాధారణ వాతావరణ పరిస్థితులతో కేదార్‌నాథ్‌లోనే ఉండాల్సి వచ్చింది. కఠిన వాతావరణ పరిస్థితుల వల్ల ఇరువురూ కేదార్‌నాథ్‌లోనే చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ డీజీ (లా అండ్ ఆర్డర్) అశోక్ కుమార్ ధ్రువీకరించారు. అయితే, సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో వీరిని గౌచార్ పట్టణానికి సురక్షితంగా తరలించినట్టు సమాచారం. హిమపాతం భారీగా పడటంతో కేదార్‌నాథ్‌లో వాతావరణ పరిస్థితుల జటిలమయ్యాయి.

ఈ హిమపాతం నడుమనే కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు సోమవారం మూసివేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆదివారం ఇరువురు సీఎంలతోపాటు బీజేపీ యూపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ కూడా పరిశీలించారు. బాబా కేదార్‌నాథ్ జీ ఆదేశాలతో తాను అక్కడకు చేరినట్టు, దాదాపు 11 నుంచి 12 ఏళ్ల తర్వాత మళ్లీ కేదార్‌నాథ్ దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆదివారం సీఎం యోగి ఆదిత్యానాథ్ విలేకరులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.

Next Story