విచ్చలవిడిగా 'మార్నింగ్ ఆఫ్టర్ పిల్’ వాడకం

by  |
విచ్చలవిడిగా మార్నింగ్ ఆఫ్టర్ పిల్’ వాడకం
X

దిశ, ఫీచర్స్: కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దలు. కానీ సెక్స్ విషయంలో ఆపుకోలేనంత తొందర ప్రదర్శించడం మనుషులకు అలవాటే. కొత్తగా పెళ్లయిన జంటలు, కెరీర్‌లో సెటిల్ అయ్యేవరకు పిల్లలు వద్దనుకునే కపుల్స్‌తో పాటు పెళ్లికి ముందే శృంగారాన్ని అనుభవిస్తున్న కొంతమంది యంగ్ జనరేషన్.. బలహీన క్షణాన పార్ట్‌నర్‌తో కమిట్ అవడం కామన్. ఎంత నిగ్రహం పాటించినా, ఎన్ని అననుకూల పరిస్థితులు ఎదురైనా.. భాగస్వామితో శృంగారాన్ని ఆస్వాదించే సమయంలో ఆ తర్వాత తలెత్తే పరిణామాలేవీ గుర్తుకురావు. అవాంఛిత గర్భం గురించి ఆలోచించినా.. ఒక్క పిల్ వేసుకుంటే సరిపోద్దిలే! అని లైట్ తీసుకుంటారు. ఇలా పార్ట్‌నర్‌తో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేదా ఇష్టపూర్వకంగా ఇంటిమేట్ అయిన ప్రతీసారి ఇన్‌స్టంట్‌గా దొరికే బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయడం అలవాటైంది. ‘మార్నింగ్-ఆఫ్టర్ పిల్’గా చెలామణిలో ఉన్న ఈ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది? ముఖ్యంగా దుర్వినియోగం చేయకుండా ఎలా వాడాలి? భవిష్యత్‌లో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా?

భారత్‌లో మెడికల్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా సులభంగా లభించే గర్భనిరోధక సాధనంగా ‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్’ 2005 నుంచి అందుబాటులో ఉంది. యంగ్ ఇండియన్ ఉమెన్ ఉపయోగిస్తున్న బర్త్ కంట్రోల్ పద్ధతుల్లో ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది. అంతేకాదు యూఎస్, చైనా తర్వాత ఈ తరహా పిల్స్‌కు ఇండియానే అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఇక ఈ పిల్ వల్ల దీర్ఘకాలిక దుష్ప్రభావాలు కలగకపోయినా.. ఎమర్జెన్సీ సందర్భంలో కాక, సాధారణ గర్భనిరోధక పద్ధతులకు ప్రత్యామ్నాయంగా విచక్షణారహితంగా వాడటంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక బ్యాకప్ ప్రొటెక్షన్‌గా వ్యవహరించే ఈ కాంట్రాసెప్షనల్ మెథడ్‌ను యూఎస్‌లో ‘ప్లాన్-బీ’గా పిలుస్తుంటారు.

ఎలా పనిచేస్తుంది?

పార్ట్‌నర్‌తో సేఫ్టీలెస్ సెక్స్‌లో పాల్గొన్న తర్వాత.. గర్భం రాకుండా ఉండేందుకు 72 గంటల్లోగా ఈ మాత్రను తీసుకోవచ్చు. కాబట్టి మీరు రుతుచక్రంలో ఏ దశలో ఉన్నారనే విషయంలో పట్టింపు అక్కర్లేదు. ప్రధానంగా ఈ మాత్రను ‘మార్నింగ్-ఆఫ్టర్ పిల్’గా పిలుస్తున్నప్పటికీ.. శృంగారం తర్వాత మరుసటి రోజు ఉదయమే తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడురోజుల్లోగా ఎప్పుడైనా తీసుకోవచ్చని, నిజానికి ఎంత త్వరగా తీసుకుంటే అంత ప్రభావవంతంగా పనిచేస్తుందని సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ డాక్టర్ నివేదిత మనోకరన్ తెలిపారు. ఇది అండం ఫలదీకరణ చెందడాన్ని నిరోధించవచ్చని లేదా ఆలస్యం చేయొచ్చని ఆమె సూచించారు. మార్నింగ్ ఆఫ్టర్ పిల్‌ను ఒక ప్రొజెస్టరాన్ మాత్రగా పేర్కొన్న మనోకరన్.. శరీరంలో ఇప్పటికే ఉన్న హార్మోన్, గర్భాన్ని నిరోధించేందుకు గాను తగినంత స్థాయిలను పెంచడానికి ఈ మాత్ర ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రొజెస్టెరాన్ లెవెల్స్ తగ్గిన తర్వాత, పిల్ తీసుకున్న దాదాపు 10 రోజుల్లోపు ‘ఫాల్స్ పీరియడ్’‌ను పొందుతారు. ఇది అకాలంగా తీవ్ర స్థాయిలో సంభవించవచ్చు.

ఇది సైడ్ ఎఫెక్ట్ కలిగించకుండా తన పని తాను చేస్తుంది. చాలామంది ఈ మాత్రల విషయంలో నెగెటివ్ రిజల్ట్స్ అనుభవించనప్పటికీ అందరికీ అలా జరగకపోవచ్చిని డాక్టర్ చెప్పారు. ప్రొజెస్టెరాన్ లెవెల్స్‌‌ విషయానికొస్తే సున్నిత శరీరాలు కలిగిఉండే వారు వికారం, తలనొప్పి, మూడ్ స్వింగ్‌ వంటి లక్షణాలను అనుభవిస్తారు. మెంటల్ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారిలోనూ ఈ పిల్ మరిన్ని సమస్యలను సృష్టించే అవకాశం ఉంది.

ఫలితాల్లో ఖచ్చితత్వం ఉంటుందా?

ప్రతీసారి 100% పనిచేయకపోవచ్చు. వాస్తవానికి ‘మార్నింగ్-ఆఫ్టర్’ పిల్ తీసుకున్నాక.. రక్తస్రావం జరగకపోతే లేదా రెగ్యులర్ పీరియడ్ మిస్ అయితే మీరు ఖచ్చితంగా గర్భధారణ పరీక్ష చేయించుకోవాలి.

ఎలాంటి సిచ్యువేషన్‌లో తీసుకోవచ్చు?

‘మార్నింగ్ ఆఫ్టర్ పిల్’ అనేది అత్యవసర గర్భనిరోధక పద్ధతి. కాబట్టి అన్‌వాంటెడ్ ప్రెగ్సెన్సీ కోసం ఎమర్జెన్సీ మెథడ్‌గానే దీన్ని ఉపయోగించాలి. అంతేతప్ప ఇది కండోమ్స్ తదితర గర్భనిరోధక పద్ధతుల ద్వారా లభించే సేఫ్టీ వంటిది కాదు. సంవత్సరానికి రెండుసార్లు గరిష్ట పరిమితిగా తీసుకుంటే సురక్షితమని చెప్పిన డాక్టర్.. ఈ పిల్‌ను తరచుగా తీసుకుంటే బలమైన దుష్ప్రభావాలను కలగకపోవచ్చు కానీ అది మంచిది కాదని సూచించారు.

సంతానోత్పత్తిపై ప్రభావం?

మార్నింగ్-ఆఫ్టర్ మాత్ర వేసుకుని, ఆర్నెళ్ల తర్వాత గర్భం దాల్చాలనుకుంటే, అది ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ఒక్కసారి ప్రొజెస్టిరాన్ ప్రభావం తగ్గిపోయి, రెగ్యులర్ పీరియడ్స్‌ను కలిగి ఉన్నట్లయితే మీరు గర్భందాల్చేందుకు ఆరోగ్యంగా ఉన్నట్లేనని మనోకరన్ చెప్పారు.



Next Story