ఆ భాష తెలిసింది 253 మందికే!

by  |
ఆ భాష తెలిసింది 253 మందికే!
X

పోయినవారం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు ‘టాంగామ్స్: యాన్ ఎథ్నోలింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ ద క్రిటికల్లీ ఎన్‌డేంజర్‌డ్ గ్రూప్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్’ పేరుతో ఒక పుస్తకం విడుదల చేశారు. అందులో భాష అంతరిస్తే సంస్కృతి కూడా అంతరిస్తుందని ఆయన నొక్కివక్కాణించారు. టాంగామ్ జాతికి చెందిన టాంగామ్ భాషను భవిష్యత్తుకు తెలియజేయాల్సిన అవసరమున్న నేపథ్యంలో ఈ పుస్తకం రాసినట్లు ఆయన చెప్పారు. అయితే ఇంతకీ టాంగామ్‌లు ఎవరు? విభిన్న ఆటవిక భాషలకు నిలయమైన అరుణాచల్ ప్రదేశ్‌లో ఈ భాషను మాత్రమే ప్రత్యేకంగా ఎందుకు హైలైట్ చేయాల్సివచ్చిందనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. వాటికి సమాధానం ఇదిగో..

ఎవరీ టాంగామ్స్?

అరుణాచల్ ప్రదేశ్‌లోని అతిపెద్దదైన అడి తెగకు చెందిన ఒక చిన్న కమ్యూనిటీ. ఎగువ సియాంగ్ జిల్లా పెయిండెమ్ సర్కిల్‌లోని కుగ్గింగ్ ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. మొదటిసారిగా వీరి గురించి 1975లో ఒక పుస్తకం విడుదలైంది. టాంగామ్స్ అనే పేరుతో తరుణ్ కుమార్ భట్టాచార్య రచించిన ఈ పుస్తకంలో దాదాపు 25 గ్రామాల్లో 2000లకు పైగా మంది ఈ కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారని తెలిసింది. కానీ 2016 నుంచి 2020 మధ్య రాజీవ్ గాంధీ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఎన్‌డేంజర్‌డ్ లాంగ్వేజెస్ (సీఎఫ్ఈఎల్) వారు ఒక సర్వే నిర్వహించి ఈ కమ్యూనిటీ గురించి ప్రకటించిన వివరాల్లో ఒక బాధాకర విషయం తెలిసింది. అదేంటంటే.. ఈ కమ్యూనిటీ వారు కుగ్గింగ్ అనే ఒకటే గ్రామంలో ఉన్నారని, వారికే పరిమితమైన టాంగామ్ భాషను మాట్లాడగలిగేవారు కేవలం 253 మంది మాత్రమే ఉన్నారని తేలింది. అందుకే వీరి భాషతో పాటు సంస్కృతి కూడా అంతరించి పోతోందని వీరి మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.

ఎందుకు అంతరిస్తోంది?

యునెస్కో వరల్డ్ అట్లాస్ ఆఫ్ ఎన్‌డేంజర్‌డ్ లాంగ్వేజెస్ (2009) నివేదిక ప్రకారం టాంగామ్ భాషను విషమ స్థితిలో ఉన్న భాషగా వర్గీకరించారు. టిబెటో-బర్మన్ భాషా కుటుంబానికి చెందిన ఈ భాషను మాట్లాడేవారు ప్రస్తుతం 253 మంది మాత్రమే ఉండడానికి గల కారణం ఇతర భాషలు, ఆర్థిక అవసరాలు. కుగ్గింగ్ గ్రామం చుట్టూ అడి తెగకు చెందని షిమాంగ్, మిన్యాంగ్, అలాగే బుద్ధుల తెగకు చెందిన ఖంబాలు కమ్యూనిటీలు నివసిస్తుంటాయి. ఈ తెగలకు వారి వారి ప్రత్యేక భాషలు ఉన్నాయి. కాబట్టి టాంగామ్ కమ్యూనిటీ వారు, వారి అవసరాల కోసం షిమాంగ్, ఖంబా, హిందీ భాషలను కూడా నేర్చుకుంటారు. ఇలా నేర్చుకుని తరచుగా వాటినే మాట్లాడటం వల్ల వారి సొంత భాష మరుగున పడిపోతోంది. ఎలాగూ లిపి కూడా లేదు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే పరిస్థితిలో కూడా ఎవరూ లేరు. ఆ భాషాభిమానం ఉన్న ఒకరో ఇద్దరో ఆసక్తి చూపించడంతో ఆ 253 మంది మాత్రమైనా మిగిలారని టాంగామ్ కమ్యూనిటీ మీద పీహెచ్‌డీ చేసిన కలింగ్ దాబి వెల్లడించారు. నిజానికి వీళ్లొక కమ్యూనిటీ ఉన్నట్లు కూడా అరుణాచల్ ప్రదేశ్‌లో 90 శాతం మందికి తెలియనేలేదని, అందుకే కుగ్గింగ్ గ్రామంలో ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, మంచినీటి సౌకర్యం కూడా లేదని కలింగ్ వివరించారు. 2018లో మొదటిసారిగా కుగ్గింగ్‌కి రోడ్డు పడిందని, ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీ నుంచి ఒక్కరు కూడా యూనివర్సిటీలో చదువుకోలేదంటే వారి దుస్థితి అర్థం చేసుకోవచ్చని కలింగ్ అభిప్రాయపడ్డారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో టాంగామ్ మాదిరిగానే చాలా భాషలు అంతరించే స్థితిలో ఉన్నాయి. భాషతో పాటు వారి సంస్కృతి కూడా మరుగున పడిపోకుండా ఉండాలంటే ఎవరో ఒకరు వారి అభివృద్ధికి పాటుపడాలి. పెమా ఖండు రాసిన 350 పేజీల బుక్‌లో ఈ టాంగామ్‌కు సంబంధించిన అనేక ఫొటోలు, వివరాలు, వారి పెద్ద తరాల వివరాలు ఉన్నాయి. అంతేకాకుండా వారి పండుగలు, కార్యాలు, ఆహారపు అలవాట్లు, నమ్మకాలు, విశ్వాసాలను కూడా పెమా ఖండు స్పష్టంగా వివరించారు. ఇలాంటి ప్రయత్నం వల్ల భాషల గురించి మాత్రమే కాకుండా ఆదివాసీ తెగల గురించి, వారి అవసరాల గురించి మిగతా ప్రపంచానికి తెలుస్తుంది. ఎంతైనా వాళ్లు కూడా మనలాంటి వాళ్లే, మనదేశంలో భాగమే!

Next Story

Most Viewed