నేడు నిరుద్యోగ జంగ్​ సైరన్​.. పాదయాత్రగా రేవంత్

by  |
Revanth
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ జయంతి నుంచి సోనియాగాంధీ పుట్టినరోజు వరకు కాంగ్రెస్​ పార్టీ రాష్ట్రంలో భారీ నిరసనకు దిగుతోంది. ఈ సారి నిరుద్యోగుల సమస్యే ప్రధాన ఎజెండాగా జంగ్​ సైరన్​ మోగిస్తోంది. కేవలం కాంగ్రెస్​ పార్టీ మాత్రమే కాదు.. అఖిలపక్షాలన్నీ ఈ నిరసనల్లో భాగస్వాములవుతున్నాయి. రాష్ట్రంలో ఏకంగా 67 రోజుల పాటు ఈ నిరసన కొనసాగుతోంది. మొన్నటి వరకు క్విట్​ ఇండియా దినం ఆగస్టు 9 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్​ 17 వరకు దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను నిర్వహించిన కాంగ్రెస్​ పార్టీ.. ఇప్పుడు నిరుద్యోగ జంగ్​ సైరన్​కు దిగింది. టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి నేతృత్వంలో ఈ నిరసన చేపడుతున్నారు.

గతంలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను ఏకంగా సీఎం కేసీఆర్​ గడ్డ గజ్వేల్​పైనే నిర్వహించి విజయవంతం చేశారు. ఇదే ఊపుతో ఉన్న హస్తం నేతలు ఇప్పుడు జంగ్​ సైరన్​ మోగిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర చేపట్టనున్నారు. దిల్​సుఖ్​నగర్​లోని రాజీవ్​ చౌక్​లో ఇందిరా, రాజీవ్​గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించి జంగ్​ సైరన్​ మొదలుపెట్టనున్నారు. దిల్​సుఖ్​నగర్​ నుంచి ఎల్​బీనగర్​లోని శ్రీకాంతాచారి విగ్రహం వరకు భారీ పాదయాత్రను చేయనున్నారు. ఈ పాదయాత్రలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మానిక్కం ఠాగూర్​, టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్​ మధుయాష్కీతో పాటు పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్లు, సీనియర్​ ఉపాధ్యక్షులు, ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.

నిరుద్యోగుల మద్దతు

కాంగ్రెస్​ చేపట్టిన ఈ ఉద్యమానికి టీఆర్​ఎస్​, బీజేపీయేతర పార్టీలు దాదాపుగా అన్నీ మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలతో కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. నిరుద్యోగ జంగ్​ సైరన్​కు మద్దతు ప్రకటించాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో ఆయా నిరుద్యోగ జేఏసీలు కూడా హాజరుకానున్నాయి.


Next Story

Most Viewed