శివారు ప్రాంతాలు మాకు.. పాతబస్తీ మీకు !

by  |
శివారు ప్రాంతాలు మాకు.. పాతబస్తీ మీకు !
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎఐఎం మధ్య దాదాపుగా అవగాహన కుదిరింది. శివారు ప్రాంతాల్లోని డివిజన్లను మజ్లిస్ వదులుకోవాలి.. పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలను టీఆర్ఎస్ వదులుకోవాలి.. తాజాగా రెండు పార్టీల మధ్య చర్చకు వచ్చిన అంశం. ఇంటెలిజెన్స్ వర్గాల అంచనా ప్రకారం ఈసారి మజ్లిస్‌కు కచ్చితంగా 37స్థానాలు వస్తాయని, గత ఎన్నికల్లో గెలిచిన కొన్నిస్థానాలు ఈసారి చేజారే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 99స్థానాలు వచ్చినా ఈసారి మాత్రం 60-70 మధ్యలో మాత్రమే వస్తాయని తేలింది. తగ్గిపోతున్న సీట్లు ఎవరికనేది స్పష్టం కాకున్నా కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి లేకపోవడంతో బీజేపీ లబ్ధి పొందుతుందన్న వాదన తెరపైకి వస్తోంది.

ఈ అవగాహన ప్రకారం టీఆర్ఎస్ పోటీ చేయాలనుకుంటున్న శివారు కాలనీలు, జూబ్లీహిల్‌ లాంటి చోట్ల మజ్లిస్ బలహీనమైన అభ్యర్థులను పెడుతుంది. పాతబస్తీలో టీఆర్ఎస్ పార్టీ మొక్కుబడిగా మాత్రమే అభ్యర్థులను నిలబెడుతుంది. ఈ రెండు పార్టీలకూ కొన్నిచోట్ల పెద్దగా కష్టపడకుండానే విజయాలు వస్తాయి. కానీ మజ్లిస్‌కు తగ్గిపోతున్న డివిజన్లకు పరిహారంగా టీఆర్ఎస్ ఎలాంటి ప్రత్యామ్నాయ లబ్ధి చేకూరుస్తుందనేది ఇంకా బహిర్గతం కాలేదు. జూబ్లీహిల్స్ విషయంలో మజ్లిస్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా రాజేంద్రనగర్‌పై మాత్రం టీఆర్ఎస్‌తో తీవ్రంగానే విభేదించినట్లు తెలిసింది. ఇప్పటికే రాజేంద్రనగర్ ప్రాంతంలో మూడు డివిజన్లలో గెలుపొందినందున వాటిని కూడా ఈసారి టీఆర్ఎస్‌ కోసం వదులుకోవడమంటే పార్టీ బలాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించుకోవడమేననే చర్చ మజ్లిస్‌లో లోతుగానే జరుగుతోంది.

టీఆర్ఎస్‌తో కుదిరిన అవగాహన ప్రకారం మజ్లిస్ పార్టీ ఇకపైన కేవలం పాతబస్తీకి మాత్రమే పరిమితం అవుతుందేమోననే ఆందోళన కూడా వినిపిస్తోంది. ఒకవైపు దేశమంతా విస్తరిస్తున్న సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బలం ఉన్న ప్రాంతాలను కూడా టీఆర్ఎస్‌కు వదులుకోవడం భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందనే వాదన తెరపైకి వస్తోంది. పైగా ఇటీవల వచ్చిన వరదల కారణంగా పాతబస్తీలో ముస్లిం ప్రజల్లో సైతం ప్రభుత్వ సాయం పట్ల వ్యతిరేకత ఉన్నందున అధికార పార్టీకి అంటకాగడం ద్వారా ఆ మేరకు దెబ్బ తగులుతుందేమో అనే అంశం బయటకు వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో శివారును వదులుకోవడం ప్రతికూలంగా మారుతుందనేది మజ్లిస్‌లోని కొద్దిమంది అభిప్రాయం.

జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ ప్రాంతాల నుంచి వైదొలిగినందుకు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో టీఆర్ఎస్ సైతం వెనక్కి తగ్గాలన్న ప్రతిపాదన మజ్లిస్ నుంచి రాగా దీనిపై టీఆర్ఎస్ ఏ విధంగా ఆలోచిస్తుందనేది కీలకంగా మారింది. అయితే నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే మరోసారి చర్చల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మజ్లిస్, టీఆర్ఎస్ మధ్య అవగాహన ఇలా ఉండగా నగర శివారు ప్రాంతాల్లో బలపడాలని బీజేపీ భావిస్తోంది. సెటిలర్లు, గతంలో టీడీపీకి ఓటు బ్యాంకుగా ఉన్నవారిని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. శివారు ప్రాంతాల్లో ఉన్నవారు ఎక్కువగా స్వయం ఉపాధి, చిరు వ్యాపారం, ప్రైవేటు ఉద్యోగాలు లాంటివాటిపైనే ఎక్కువగా ఆధార పడుతున్నందున ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవాలనుకుంటోంది. మల్కాజిగిరి‌లో కాంగ్రెస్‌కు కొద్దిగా పట్టు ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఉన్న అయోమయ పరిస్థితిని అనుకూలంగా మల్చుకోవాలనుకుంటోంది.

Next Story