హైదరాబాద్‌లో అనుమతిలేని స్కైవేలు.. అధికారులు పట్టించుకోరా..?

by  |
హైదరాబాద్‌లో అనుమతిలేని స్కైవేలు.. అధికారులు పట్టించుకోరా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమా లేక ప్రజలదా అన్న సంబంధం లేకుండా కబ్జా చేసేస్తున్నారు. ఇది మరింత ముదిరి ఇప్పుడు ఆకాశాన్ని కూడా కబ్జా చేసే స్థాయికి కబ్జాదారులు చేరుకున్నారు. నగరంలో ఒక్కొక్కటిగా ప్రైవేటు కంపెనీల స్కైవేలు వెలుస్తున్నాయి. అవి కూడా ప్రభుత్వ రోడ్డు పైనుంచి వీటిని వేసేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులపైనే నిర్మించిన స్కైవేలను చూసి నగరవాసులు అవాక్కవుతున్నారు. నగరంలో పెద్ద పేరున్న ప్రైవేటు ఆసుపత్రి, హోటళ్లు తమకు అనుగుణంగా ఉండేలా స్కైవేలు ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణాలు చేపట్టినప్పటికీ గ్రేటర్, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.

మలక్ పేట్‌లోని యశోద ఆసుపత్రి బిల్డింగ్‌కి పక్కనే ఉన్న ఇంకో భవన సముదాయానికి కలుపుతూ స్కైవే నిర్మించుకుంది. రెండు బిల్డింగుల మధ్య ప్రభుత్వ రహదారి ఉందని మరిచి ఆసుపత్రి యజమానులు యథేచ్చగా స్కైవే నిర్మించేశారు. దీంతో పాటు నగరంలోని మారియట్ హోటల్ తన రెండు బిల్డింగుల మధ్య, బంజారాహిల్స్ లోని రెండు తాజ్ హోటళ్ల మధ్య స్కైవేలు విశాలంగా నిర్మించుకున్నారు. ఇలా రోజు రోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అనధికార స్కై వేల పై నెటిజనులు ప్రశ్నలు వెల్లువెత్తారు. నగరంలో జరుగుతున్న ఇలాంటి ఆక్రమణలు, అనధికార కట్టడాలపై జీహెచ్ఎంసీకి విజయ్ గోపాల్ అనే సామాజిక వేత్త ఫిర్యాదులు చేశారు. అనధికార స్కైవేలను ట్విట్టర్ వేదికగా కేటీఆర్, జీహెచ్ఎంసీ అధికారులకు, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కి ట్యాగులు చేశారు. ఇది చూసిన నగరవాసులు నెట్టింట విమర్శిస్తున్నారు.



Next Story

Most Viewed