దుబాయ్‌లో ఐపీఎల్

by  |
దుబాయ్‌లో ఐపీఎల్
X

దిశ, స్పోర్ట్స్: సందిగ్ధం వీడింది. ఊగిసలాటకు తెరపడింది. ఈ ఏడాది జరుగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 13 నిర్వహణపై బీసీసీఐ స్పష్టతకు వచ్చింది. దుబాయ్‌లో నిర్వహించాలని బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ సమావేశమైంది. టీ20 వరల్డ్ కప్‌పై ఐసీసీ నిర్ణయం తీసుకున్న వెంటనే ఐపీఎల్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించనుంది. సుదీర్ఘంగా సాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐపీఎల్ పైనే చర్చ జరిగింది. మెజార్టీ సభ్యులు లీగ్ నిర్వహణకే మొగ్గు చూపినట్లు సమాచారం. వచ్చే వారం ఐసీసీ బోర్డు సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో టీ20 వరల్డ్ కప్ భవితవ్యం తేలనుంది. ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి నవంబర్ మొదటి వారం మధ్యలో ఐపీఎల్ నిర్వహించడానికి ఆమోదం లభించింది.

యూఏఈనే హోస్ట్..

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ పూర్తిగా స్తంభించిన క్రమంలో మార్చి 29న ప్రారంభం కావల్సిన ఐపీఎల్ సీజన్ 13ను ఏప్రిల్ 15కి వాయిదా వేశారు. కానీ, ఆ తర్వాత దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో మెగా లీగ్‌ను నిరవదికంగా వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత ఐపీఎల్ నిర్వహణకు అవకాశమే లేకుండా పోయింది. ఈ ఏడాది జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్య ఆస్ట్రేలియా సుముఖంగా లేకపోవడంతో ఐపీఎల్‌పై ఆశలు చిగురించాయి. దీనిపై ఇంతవరకు ఐసీసీ నిర్ణయం తీసుకోకపోవడంతో ఐపీఎల్‌పై సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఎలాగైనా లీగ్ నిర్వహించి తీరుతామని బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే అనుబంధ సంస్థలకు లేఖ రాశారు. కానీ, వేదిక ఎక్కడనే అనుమానాలు నెలకొన్నాయి. అప్పుడే, ఐపీఎల్ నిర్వహణకు శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ముందుకు వచ్చాయి. గతంలో లీగ్‌ను నిర్వహించిన అనుభవం యూఏఈకి ఉంది. అంతేకాకుండా దుబాయ్ స్పోర్ట్స్ సిటీ, ఐసీసీ అకాడమీ తదితర అంతర్జాతీయ వేదికలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో బీసీసీఐ అపెక్స్ కమిటీ భేటీలో యూఏఈ వేదికనే ఖరారు చేశారు.

మేం రెడీ : దుబాయ్ స్పోర్ట్స్ సిటీ

ఐపీఎల్ ఎప్పుడు జరిగినా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ హెడ్ సల్మాన్ హనీఫ్ చెప్పారు. దుబాయ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియాలు ఉన్నట్లు ఆయన చెప్పారు. స్పోర్ట్స్ సిటీతోపాటు ఐసీసీ అకాడమీలోని స్టేడియం కూడా ఐపీఎల్ కోసం వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే సమాచారం అందిందని, ఐపీఎల్ కోసం సర్వం సిద్ధం చేస్తామని ఆయన వెల్లడించారు.

Next Story