రెండు శవాలు.. ఒకటే ‘బూడిద’.. మాదంటే మాదని ఇరు వర్గీయుల కోట్లాట..!

by  |
ashes
X

దిశ, జగిత్యాల : జిల్లా కేంద్రంలో వింత సంఘర్షణ చోటుచేసుకుంది. రెండు కుటుంబాల మధ్య సాధారణంగా ఆస్తుల కోసం, భూముల కోసం గొడవలు జరుగుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఇక్కడ విచిత్రంగా ‘అస్థికల’ కోసం రెండు కుటుంబాలు గొడవకు దిగారు.ఈ ఘటన గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గత బుధవారం రాత్రి 7 గంటలకు జగిత్యాల పట్టణానికి చెందిన పోచమ్మ (110) అనే వృద్ధురాలి మృతి చెందగా.. ఆమెకు చింతకుంట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాలు అన్ని అయిపోయాక పోచమ్మ కుటుంబ సభ్యులు వెళ్లిపోయారు.

ఆ తర్వాత భీమయ్య మృతదేహాన్ని రాత్రి 11గంటల ప్రాంతంలో అదే స్మశాన వాటిక తీసుకువచ్చారు. ఆ సమయంలో వర్షం పడుతుండంతో ఆ ప్రాంతంలో ఎవరు లేరు. అయితే, పోచమ్మకు దహన సంస్కారాలు చేసిన చోటే భూమయ్యకు కూడా అంత్యక్రియలు పూర్తి చేసి బంధువులు వెళ్లిపోయారు.గురువారం ఉదయం అస్థికల కోసం పోచమ్మ కుటుంబ సభ్యులు స్మశానవాటికకు వచ్చారు. అదే సమయంలో భీమయ్య కుటుంబ సభ్యులు కూడా అస్థికల కోసం రావడంతో గొడవ ప్రారంభమైంది. ఆ ప్రదేశంలో ఉన్న అస్థికలు మావీ అంటే మావీ అని రెండు కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఈ విషయం తెలియడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే, వైకుంఠధామాల్లో ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా ప్రభుత్వ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.కాగా, ఆ అస్థికలు ఎవరికి చెందాయనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు..

Next Story