జర్నలిస్టులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి

by  |
జర్నలిస్టులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలి
X

దిశ, మెదక్: కరోనా నివారణకు రాష్ట్రంలో అమలవుతున్న లాక్‌డౌన్ వలన ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ, పట్టణ ప్రాంత జర్నలిస్టులను ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కోరారు. సోమవారం మంత్రి సంగారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పట్టణానికి విచ్చేశారు. టీడబ్లూజేఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎల్గొయి ప్రభాకర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులను ఆదుకోవాలని కోరుతూ మంత్రికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. గత మూడు వారాలుగా అమలులో ఉన్నలాక్‌డౌన్‌ వలన చాలా మంది జర్నలిస్టులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.అయినా కరోనా నివారణకు వృత్తిరీత్యా తమ వంతు బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. చాలా మంది గ్రామీణ, పట్టణ ప్రాంత జర్నలిస్టులు పేదరికంలో వున్నారని వీరికి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని కోరారు. కనీసం 3నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఉచితంగా అందించాలని, నెలకు రూ .5000 నగదు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు సైతం భయపడకుండా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని వారు కోరారు. స్పందించిన మంత్రి నిత్యావసర సరుకులు అందజేస్తామని , మిగతా వాటి గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీనిచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు పాండు, షౌకత్ అలీ, యాదగిరి , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

tags: corona, lockdown, journalist, twjf, minister harish rao

Next Story

Most Viewed