ఓవర్ లోడ్‌ దందాతో ఆదాయానికి గండి

by  |
ఓవర్ లోడ్‌ దందాతో ఆదాయానికి గండి
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఇసుక క్వారీల్లో సాగుతున్న అక్రమాల తంతును నిలువరించే వారు లేకుండా పోయారు. అడ్డగోలుగా సాగుతున్న అక్రమాలను పట్టించుకునే వ్యవస్థ గాంధారి పాత్ర పోషిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. నిత్యం సాగుతున్న ఈ తతంగం వల్ల సర్కారు ఆదాయానికి పెద్ద ఎత్తునా గండి పడుతున్నది.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పల్టుల, మహదేవపూర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు అనుమతి ఇచ్చారు. ఆయా క్వారీల నుంచి డీడీలు కట్టిన లారీలు, అందులో లోడ్ అవుతున్నా ఇసుక నిభందనల ప్రకారం సాగుతుందా అని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టీఎస్ఎండీసీ ఉద్యోగులను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ ఓవర్ లోడ్‌తో ఇసుక అక్రమ రవాణా సాగుతుండటం విశేషం. లారీ కెపాసిటీని పట్టి ఇసుక లోడ్ చేయాల్సింది పోయి అదనపు బకెట్ల దందాకు తెర లేపారు.

ఎక్స్‌ట్రా బకెట్లతో..

లారీ సామర్థ్యాన్ని బట్టి ఇసుకను లోడ్ చేసేందుకు అధికారులు నిబంధనలు ఏర్పర్చారు. ఇసుకను గోదావరి నుంచి డంప్ యార్డుకు తరలించిన తర్వాత లారీల్లోకి లోడ్ చేస్తుంటారు. జేసీబీల ద్వారా లోడ్ చేస్తున్న ఈ క్రమంలో ఎక్స్ ట్రా బకెట్ పేరిట సర్కారు ఆదాయానికి గండి కొడుతున్నారు. ఒక్కో బకెట్‌కు రూ.2వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి లారీకి రెండు బకెట్ల చొప్పున ఎక్స్‌ట్రాగా నింపి క్వారీ నిర్వాహకులు బాహాటంగా సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.

100 కోట్లకు గండి.!

మినరల్ డెవపల్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఏటేటా వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని సర్కారుకు అందిస్తున్నామని ఢంకా బజాయించి చెప్తున్నా అక్రమ దందాను నిలువరిస్తే అదనపు ఆదాయం సర్కారుకు వస్తుందని అంటున్నారు స్థానికులు. అదనంగా మరో వంద కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని సర్కారుకు సమకూర్చే అవకాశం ఉంటుందని ఓ అంచనా. అయినా అధికారులు మాత్రం ఈ అక్రమ దందాను నియంత్రించేందుకు చొరవ చూపకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.

ఓవర్ లోడ్‌తో రోడ్లు ధ్వంసం

ఓవర్ లోడ్‌తో లారీలు తిరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గడమే కాకుండా రహదారులు కూడా ధ్వంసం అవుతున్నాయి. దీంతో గ్రామాల్లో రోడ్లు గుంతలు పడి స్థానికుల సహానాన్ని పరీక్షిస్తున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు వేసే రోడ్డు సామర్థ్యం ఎంత వాటిపై నుంచి ఓవర్ లోడ్ వెళ్తుందా లేదా అన్నది టెక్నికల్‌గా కూడా నిరూపించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. రోడ్ల సామర్థ్యానికి మించిన బరువుతో లారీలు ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో ఓవర్ లోడ్ కు సంబంధించిన లారీలను పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసినా టీఎస్ఎండీసీ అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించడం లేదు. దీంతో క్వారీ నిర్వహకులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైంది. వందలాది లారీల్లో రెండు చొప్పున ఎక్స్ ట్రా బకెట్ల ఇసుక నింపుతుండడంపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed