శ్రీవారి ఆస్తులివే.. టీటీడీ చరిత్రలోనే ఫస్ట్ టైమ్..

299

దిశ, రాయలసీమ: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీనివాసుడి ఆస్తుల వివరాలు బహిరంగంగా వెల్లడించడం టీటీడీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు స్వామివారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల కాలేదు. స్వామివారి ఆస్తుల గురించి ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ఉందని టీటీడీ భావించి, భక్తులు సమర్పించిన కానుకలు, శ్రీవారికి ఉన్న ఆస్తులకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా ప్రకటించింది. ఈ మేరకు శ్రీవారి ఆస్తుల వివరాలను తెలుపుతూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వివరాలను www.tirumala.org లో అందుబాటులో ఉంచినట్లు టీటీడీ పేర్కొంది.

ఆస్తుల వివరాలివే

టీటీడీ ఆధీనంలో ఉన్న స్వామివారి మొత్తం ఆస్తుల సంఖ్య 1128. మొత్తంగా 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ మొత్తం భూమిని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థలాలుగా విభజించింది. ఇందులో వ్యవసాయ ఆస్తుల సంఖ్య 233. ఈ వ్యవసాయ భూమిలో 2085 ఎకరాల 41 సెంట్లు స్వామివారి పేరు మీద ఉన్నట్లు వెల్లడించింది. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895, కాగా ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉంది.

TTD

శ్రీవారి 141 ఆస్తుల విక్రయం

శ్రీవారికి చెందిన మొత్తం 141 ఆస్తులను 1974 నుంచి 2014 వరకు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది. మొత్తంగా స్వామివారి 335 ఎకరాల 23 సెంట్ల స్థలాన్ని అమ్మినట్లు వివరించింది. ఈ భూముల్లో వ్యవసాయానికి చెందిన ఆస్తుల సంఖ్య 61.293 ఎకరాల 02 సెంట్లు.. వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 80.. అంటే 42 ఎకరాల 21 సెంట్ల వ్యవసాయేతర ఆస్తులను విక్రయించారు. ఈ భూముల అమ్మకం ద్వారా టీటీడీ పాలక మండలికి రూ. 6 కోట్ల 13 లక్షల ఆదాయం లభించినట్లు టీటీడీ పేర్కొంది.

గతేడాది నవంబర్ నాటికి ఉన్న ఆస్తుల వివరాలు

2020 నవంబర్ 28వ తేదీ వరకు నికర ఆస్తుల సంఖ్య 987గా పేర్కొంది. 7,753 ఎకరాల 66 సెంట్లు టీటీడీ ఆధీనంలో ఉన్నాయి. ఇందులో 172 వ్యవసాయ అవసరాలకు వినియోగించేవి. మొత్తంగా 1,792.39 సెంట్ల వ్యవసాయ భూమి ప్రస్తుత పాలకమండలి ఆధీనంలో ఉంది. 5,961 ఎకరాల 27 సెంట్ల వ్యవసాయేతర స్థలాలు టీటీడీ వద్ద ఉన్నాయని పేర్కొంది.

టీటీడీ స్థిరాస్తుల వివరాలివే

– టీటీడీ మొత్తం ఆస్తులు 1128, విస్తీర్ణం-8088 ఎకరాల 89 సెంట్లు, వ్యవసాయ ఆస్తులు – 233

– వ్యవసాయ ఆస్తుల విస్తీర్ణం-2085 ఎకరాల 41 సెంట్లు, వ్యవసాయేతర ఆస్తులు – 895

– వ్యవసాయేతర ఆస్తుల విస్తీర్ణం – 2 కోట్ల 90 లక్షల 56 వేల 843.88 చదరపు గజాలు 

– 1974 నుంచి 2014 వరకు టీటీడీ అమ్మిన మొత్తం ఆస్తులు -141 

– అమ్మిన మొత్తం ఆస్తుల విస్తీర్ణం- 335 ఎకరాల 23 సెంట్లు, అమ్మిన వ్యవసాయ ఆస్తులు – 61

– అమ్మిన వ్యవసాయ ఆస్తుల విస్తీర్ణం- 293 ఎకరాల 2 సెంట్లు, అమ్మిన వ్యవసాయేతర ఆస్తులు – 80 

– అమ్మిన వ్యవసాయేతర ఆస్తుల విస్తీర్ణం- 2 లక్షల 4 వేల 342.36 చదరపు గజాలు 

– ఆస్తులు అమ్మగా వచ్చిన ఆదాయం – 6 కోట్ల 13 లక్షలు 

– 2020 నవంబర్ 28 నాటికి టీటీడీ నికర ఆస్తుల సంఖ్య- 987, విస్తీర్ణం – 7753 ఎకరాల 66 సెంట్లు 

– వ్యవసాయ ఆస్తుల సంఖ్య – 172 , విస్తీర్ణం -1792.39 ఎకరాలు, వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య – 815, విస్తీర్ణం -2 కోట్ల 88 లక్షల 52 వేల 501.52 చదరపు గజాలు.