TSPSC : ఆ నిరుద్యోగులకే ఫస్ట్ ప్రయారిటీ..?

by  |
TSPSC : ఆ నిరుద్యోగులకే ఫస్ట్ ప్రయారిటీ..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో 50 వేల కొలువులను భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ముందుగా రాజకీయ నిరుద్యోగులపై దృష్టి పెట్టింది. ఏండ్ల నుంచి పదవులు రాకుండా ఆశతో ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడైనా అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా సర్కారు కొలువులు భర్తీ చేసే సర్వీస్​కమిషన్‌కు పూర్తిస్థాయిలో పాలకవర్గాన్ని నియమించాలని సీఎం కేసీఆర్​నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం కసరత్తు కూడా ప్రారంభమైందని చెబుతున్నారు. ఇప్పటి వరకు చైర్మన్‌గా వ్యవహరించిన ఘంటా చక్రపాణి, మెంబర్లు సి.‌విఠల్, బి.చంద్రావతి, మహ్మద్ ఖాద్రీ పదవీకాలం డిసెంబర్​17తో ముగిసింది. మరో ఇద్దరు మెంబర్లు ప్రొఫెసర్ సాయిలు చింతా, డి.కృష్ణారెడ్డి పదవీకాలం మాత్రమే ఇంకా ఉంది. కృష్ణారెడ్డికి తాత్కాలికంగా చైర్మన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాల్లో కొత్తవారిని నియమించడంపై సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రగతిభవన్ వర్గాలు ఆశావహుల లిస్టును తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలిసింది. లిస్టులో రాజకీయ నాయకులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఉద్యోగ సంఘాల నేతల పేర్లున్నట్లు సమాచారం. టీఎస్పీఎస్సీ చైర్మన్, మెంబర్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గతంలోనే జీవో కూడా విడుదల చేసింది.

ఐఏఎస్‌ల ఖాతాకే చైర్మన్​..

టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ను మాత్రం ఈసారి ఐఏఎస్‌తోనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే ఆశావహులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారని చెబుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్​ అధికారి నవీన్‌‌చంద్‌కు ఈ బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరిగినా ఇంకా స్పష్టత రాలేదు. ఆయనకే ఇష్టం లేదని కొందరు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌కు ముందు నుంచీ ఆర్థికంగా, పార్టీపరంగా అండగా నిలిచిన ఓ రాజ్యసభ ఎంపీకి నవీన్‌చంద్ దగ్గరి బంధువు కావడంతో ఆయనకు చైర్మన్ ఇస్తారనుకున్నారు. ఇటీవల పదవీ విరమణ పొందిన మరో ఐఏఎస్​అధికారి కూడా చైర్మన్ స్థానంపై ఆశ పెట్టుకున్నారు. సీనియర్‌గా ఉన్నా సీఎస్ పదవి రాలేదని కొంత అసంతృప్తి ఆయనలో ఉంది. ఏడు నెలల కింద పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ చైర్మన్ కోసం ఇప్పించాలని సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ ప్రభుత్వ సలహాదారుతో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉద్యోగ సంఘాల నేతలు కూడా..

టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా అవకాశం ఇప్పించాలని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు నేతలు కూడా సీఎం కేసీఆర్‌కు ఇప్పటికే అర్జీలు పెట్టుకున్నారు. టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు కారం రవీందర్​రెడ్డికి సీఎం హామీ ఇచ్చారని అంటున్నారు. రవీందర్‌రెడ్డి సేవలు తీసుకుంటామని సీఎం నోటి నుంచే రావడంతో ఆయన ఆశలు పెట్టుకున్నారు. టీజీఓ హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు డా.గండూరి వెంకటేశ్వర్లు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సర్వీసు కమిషన్‌లోనే అసిస్టెంట్​డైరెక్టర్‌గా ఉన్నారు. ఇంకా ఏడేండ్లకుపైగా సర్వీసు ఉంది. టీఎస్‌పీఎస్సీలో అనుభవం ఉందని, తనకు సభ్యుడిగా అవకాశం ఇవ్వాలంటూ అటు పార్టీ అధిష్టానానితో పాటు టీజీఓ వ్యవస్థాపకుడు, మంత్రి శ్రీనివాస్​గౌడ్‌కు కూడా విన్నవించారు. మంత్రి కూడా ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీ‌శంకర్​కూడా మెంబర్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇటీవల ప్రగతిభవన్ వర్గాల నిఘాలో గౌరీ‌శంకర్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

యూపీఎస్సీ మెంబర్‌‌గా ఘంటా?

తెలంగాణ పబ్లిక్​సర్వీసు కమిషన్ చైర్మన్‌గా రిటైర్ అయిన ఘంటా చక్రపాణికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్‌గా అవకాశం కల్పించేందుకు సీఎం కేసీఆర్ నివేదించారని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ఆయన పేరును సూచించారని, సౌత్ ఇండియా నుంచి యూపీఎస్సీ మెంబర్లుగా ఎవరూ లేకపోవడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశీస్సులు, ఆరేళ్లపాటు రాష్ట్ర కమిషన్ చైర్మన్‌గా పనిచేయడం చక్రపాణికి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఉద్యోగ సంఘాల నేత, టీఎస్‌పీఎస్సీ మాజీ సభ్యుడు విఠల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం కేసీఆర్‌కు పలువురు రాజకీయ సలహాదారుల నుంచి కూడా చెప్పించారనుకుంటున్నారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం విఠల్ వద్దంటూ అధిష్ఠానానికి చెప్పిస్తున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే స్వామిగౌడ్​వ్యవహారం పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed