హీరోలా.. జీరోలా..? భద్రాచలం నేతల భవిష్యత్తు తేలేది నేడే!

by  |
హీరోలా.. జీరోలా..? భద్రాచలం నేతల భవిష్యత్తు తేలేది నేడే!
X

దిశ, భద్రాచలం: అధికార టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం పోటీపడుతున్న నాయకుల రాజకీయ భవిష్యత్తు నేడు తేలబోతోంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భద్రాచలం పట్టణంలోని టీఎస్ టూరిజం హాల్‌లో టీఆర్ఎస్ పార్టీ భద్రాచలం, దుమ్మగూడెం, చర్ల మండలాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు ముఖ్య అతిథులుగా మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మైన్ దిండిగల రాజేందర్, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రమ్మయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్‌‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మరో రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొననున్నారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన పార్టీ వార్డు, గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో మండల అధ్యక్ష పదవులు ఆశిస్తున్న నాయకుల రాజకీయ భవిష్యత్తుపై కీలకంగా చర్చ చేయనున్నారు. మండల నాయకులను మెప్పించి, ఒప్పించి, బుజ్జగించి పార్టీ పెద్దలు నేడు కమిటీలను ఫైనల్ చేస్తారని సమాచారం.

పదవుల కోసం జోరుగా పైరవీలు

పార్టీ పదవుల కోసం టీఆర్ఎస్ నాయకులు జోరుగా పైరవీలు చేస్తున్నారు. కొందరు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆశీస్సుల కోసం, మరికొందరు మంత్రి సత్యవతి రాథోడ్ ఆశీస్సుల కోసం, ఇంకొందరు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఆశీస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు పార్టీ పెద్దలు నూకల నరేశ్‌రెడ్డి, తాతా మధు, తెల్లం వెంకట్రావుల అభయం కోసం ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో ఇక పదవులు తమ వర్గాలకే పదవి దక్కుతుందని నాయకులు ఎవరికి వారే ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొందరు నాయకులు మరో అడుగు ముందుకేసి తమ గ్రూపుకే పదవులు ఖరారు అయినట్లు తెలివిగా మీడియాకు లీకులు ఇస్తున్నారు. అనుకూల వార్తలు వస్తే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నారు. టీఆర్ఎస్‌లో పదవుల ఫైటింగ్‌ను రాజకీయ విశ్లేషకులు నిశితంగా గమనిస్తున్నారు. పార్టీ పదవులు పొంది హీరోలు అయ్యేది ఎవరు, చేజార్చుకొని జీరోలుగా మిగిలేది ఎవరనేది పరిశీలిస్తున్నారు.

ఎలక్షన్ టీమ్‌పై పార్టీ నిఘావర్గాల దృష్టి

టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్నుకునే మండల కమిటీల ఆధ్వర్యంలోనే వచ్చే ఎన్నికలకు ప్రజలు ముందుకెళ్లాల్సి ఉన్నందున పార్టీకి మేలుచేసే పటిష్ట నాయకత్వంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికపై అనుకూల, ప్రతికూల అంశాలపై నిఘా వర్గాలు ఆరా తీసినట్లుగా విశ్వసనీయ సమాచారం. పదవులు ఆశిస్తున్న నాయకుల పనితీరు, వ్యక్తిగత ప్రవర్తన మూలంగా పార్టీకి నష్టమా? లాభమా? అనే అంశాలను నిఘా వర్గాలు పరిశీలించి అధిష్టానానికి నివేదించినట్లు తెలుస్తోంది. పైరవీల కంటే పార్టీని సమన్వయం చేస్తూ, ఇతర పార్టీల నుంచి చేరికలు చేయగల సత్తా కలిగిన నాయకులకు ఈసారి పదవులు కట్టబెట్టాలని పార్టీ అధిష్టానం ఎన్నికల అబ్జర్వర్లకు గట్టిగా చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే పదవుల కోసం పోటీ పడుతున్న నాయకులతోపాటు అధిష్టానం మదిలో మెదిలే కొత్తవారు తెరపైకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఏదిఏమైనా బుధవారం భద్రాచలంలో జరుగనున్న టీఆర్ఎస్ పార్టీ సమావేశం కీలకం కానుంది. ఈ నేపథ్యంలో అందరూ మధ్యాహ్నం మంత్రి సమక్షంలో జరిగే సమావేశం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Next Story