పార్టీ పదవులు..పంచేదెప్పుడు ?

by  |
పార్టీ పదవులు..పంచేదెప్పుడు ?
X

దిశ, న‌ల్ల‌గొండ‌ :
టీఆర్‌ఎస్‌‌ ఆవిర్భావం నుంచి పార్టీకి అండగా ఉన్న నాయకులతో పాటు ఆయా సందర్భాల్లో పదవులపై హామీతో పార్టీలో చేరినవారి పరిస్థితి ప్రస్తుతం కక్కలేక ..మింగలేక అన్నట్టు తయారైంది. ప్రభుత్వ నామినేటెడ్‌ పదవులనో లేక పార్టీ సంస్థాగత పదవులనో అడగలేక, నాయకత్వాన్ని నిలదీయ లేక ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ నిరుద్యోగులుగా మారామ‌న్న అభిప్రాయం పలువురు నాయకుల్లో బలంగా వినిపిస్తోంది. పార్టీ అధినాయకత్వం నామినేటెడ్‌ పదవుల కేటాయింపుపై దృష్టి సారించకపోవడంతో..తమను పదవీ యోగం ఎప్పుడు వరిస్తుందా ..అని చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు.

ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం బహిరంగంగా విమర్శలకు దిగకపోయినా..తమ ప్రైవేటు చర్చల్లో మాత్రం అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక తప్పకుండా పార్టీలో సంస్థాగత పదవులు దక్కుతాయని ఆశించినా అలా జరగలేదు. 2014లో పార్టీ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు కొందరికి పదవులు కట్టబెట్టారు. పదవీ కాలపరిమితి పూర్తయిన వారిలో కొందరికి రెన్యూవల్‌ చేశారు. దేవాలయ కమిటీలు, మార్కెట్‌ కమిటీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్లలో సభ్యుల పోస్టులు ఇలా పలు పదవులను భర్తీ చేయాల్సి ఉంది. పైగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించలేకపోయిన వారికి నామినేటెడ్, లేదంటే పార్టీ పదవులు ఇస్తామని నచ్చజెప్పిన నాయకత్వం ఎన్న‌ికల తరువాత‌ ఆ ఊసే ఎత్తడం లేదని ఆశావహులు వాపోతున్నారు.

పార్టీ పదవులేవీ..?

అధినాయకత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందకుండా స్థానికంగా ఏ చిన్న పదవినీ ఎమ్మెల్యేలు భర్తీ చేసే అవకాశం లేకపోవడంతో చివరకు పార్టీ పదవులూ ఖాళీగానే ఉన్నాయి. గతేడాది మండల కమిటీలకే పరిమితమై నియోజకవర్గ, జిల్లా కమిటీల ఊసే మరిచారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఎదురవుతుందా అన్న మీమాంస గులాబీ శ్రేణులను వేధిస్తోంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం పార్టీ నిబంధనావళిలో చేసిన మార్పుల నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పోస్టును రద్దు చేశారు. ఆ స్థానంలో ఇద్దరిని జిల్లా ఇన్‌చార్జ్‌లుగా నియమించాలి. ఈ సవరణ జరిగి ఐదేళ్లు దాటుతున్నా అమల్లోకి మాత్రం రాలేదు. దీంతో యాదాద్రి భువ‌న‌గిరి, సూర్య‌ాపేట‌, న‌ల్ల‌గొండలో పార్టీకి సంస్థాగత సారథి ఎవరూ లేకుండా పోయారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన బండా నరేందర్‌రెడ్డి ప్రస్తుత జెడ్పీ చైర్మన్‌ పదవిలో ఉన్నారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారికి ఎలాంటి గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ ఉంది.

‘కొత్త’..లొల్లి

పాత, కొత్త నాయకులు, వారి కేడర్‌తో పార్టీ కిక్కిరిసిపోయింది. దీంతో సహజంగానే గ్రూపులు తయారయ్యాయి. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో ఇప్ప‌టికే మంత్రి జ‌గ‌దీష్‌రెడ్డి, శాస‌న‌మండ‌లి స్పీక‌ర్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, రైతు స‌మ‌న్వ‌య స‌మితి రాష్ట్ర అధ్య‌క్షులు ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డిలు ఎవరికి వారు త‌మ ఆధిప‌త్యాన్ని పెంచుకునేందుకు చేస్తోన్న ప్ర‌య‌త్నాల‌తో జిల్లాలో గులాబీ పార్టీ మూడు గ్రూపులుగా త‌యారైంది. న‌కిరేక‌ల్‌లో కాంగ్రెస్ నుంచి వ‌ల‌సొచ్చిన ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వ‌ర్గీయుల మ‌ధ్య‌న లొల్లి న‌డుస్తోంది. భువ‌న‌గిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖ‌ర్‌రెడ్డి వ‌ర్సెస్ జెడ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి మ‌ధ్య‌న వైరం పెరుగుతున్న‌ది. కోదాడ‌లో ఎమ్మెల్యే బొల్లం మల్ల‌య్య‌యాద‌వ్, మాజీ ఎమ్మెల్యే వేనేప‌ల్లి చంద‌ర్‌రావు మ‌ధ్య‌న ప‌చ్చిగ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత శ‌త్రుత్వం పెరిగిపోతున్న‌ది. ఫలితంగా గ్రూపు రాజకీయం నడుస్తోంది. ఈ పరిస్థితి నల్లగొండ, నకిరేకల్‌ మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా జిల్లా టీఆర్‌ఎస్‌‌లో ఇప్పుడు పదవుల లొల్లి మొదలైంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అధినాయకత్వం మాత్రం పదవుల పంపకంపై మీనమేషాలు లెక్కిస్తోందన్నఅభిప్రాయం నాయకుల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

Tags: Nallagonda, TRS, Group Political, Nominated Posts

Next Story

Most Viewed