టీఆర్ఎస్‌లో నయా జోష్.. నెల రోజుల పాటు కార్యక్రమాలు

by  |
trs leader
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపేందుకు పార్టీ సిద్దమైంది. నెల రోజులపాటు కంటిన్యూగా ప్రోగ్రాంలను చేపట్టనుంది. కార్యకర్తలతో నిత్యం మమేకమై పార్టీ చేసిన అభివృద్ధి, చేపట్టే కార్యక్రమాలను వివరించడంతో పాటు రాబోయే ఎన్నికలకు ఇప్పటినుంచే సన్నద్ధం చేయనుంది. అందులో భాగంగానే పార్టీని సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీలను పూర్తి చేసి పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తుంది.

2001 ఏప్రిల్ 27న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది. నాటి నుంచి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని చివరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అత్యధిక స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో సైతం ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. అయితే పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు కరోనాతో వాయిదా పడిన ప్లీనరీని నిర్వహించేందుకు సిద్ధమైంది పార్టీ అధిష్టానం. అందుకు అన్ని ఏర్పాట్లను ప్రారంభించింది. ఈ నెల 14 నుంచి ప్లీనరీ, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఏర్పాట్లను ప్రారంభించారు.

హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కమిటీలను సైతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ నెల 17న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్ లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు నామినేషన్ల స్వీకరణను ప్రారంభించనున్నారు. ఈ నెల 22 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 23న పరిశీలన, 24న నామినేషన్ల స్వీకరణ, 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, అనంతరం ప్లీనరీని నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 15న వరంగల్ లో ‘తెలంగాణ విజయగర్జన’ సభ నిర్వహిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఈ నెల 27న అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. అందుకు గురువారం నుంచే కార్యచరణను పార్టీ ప్రారంభించింది.

సభ్యత్వాల నమోదులో 60 లక్షలు చేసిన ప్రాంతీయ పార్టీగా టీఆర్‌ఎస్ రికార్డు సృష్టించింది. అంతేకాదు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సెప్టెంబర్ 2న జెండా పండుగతో గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల నియామకాలను ప్రారంభించారు. 12769 గ్రామాల్లో కమిటీలు, అనుబంధ కమిటీలను పూర్తి చేశారు. 3 వేల మండల కమిటీలతో పాటు పట్టణ, మున్సిపాలిటీ కమిటీలు, గ్రేటర్ హైదరాబాద్ లో బస్తీ కమిటీలు, అనుబంధ కమిటీలను నియమించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. హైదరాబాద్, వరంగల్ మినహా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. నవంబర్ 15 తర్వాత వీటిని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే మండలాల వారీగా పార్టీ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నారు.


Next Story

Most Viewed