ఊహించిన వారికి నిరాశేనా..!

by  |
ఊహించిన వారికి నిరాశేనా..!
X

నామినేటెడ్ పదవులపై టీఆర్ఎస్ నాయకుల్లో రోజురోజుకీ టెన్షన్ పెరుగుతోంది. పదవుల రెన్యువల్ కోసం కొందరు నేతలు తహతహలాడుతుంటే మరి కొందరు నూతన పదవుల కోసం కాపు కాస్తున్నారు. నిత్యం అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పదవుల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెన్యువల్ కోసం ఎదురుచుస్తున్న అశావహుల్లో నిరాశే మిగిలింది. అసలు ఊహించని వారికి పెద్ద పెద్ద పదవులు వస్తుండటంతో నేతల్లో ఆ టెన్షన్ మరింత పెరుగుతోంది. ఇటీవల జరిగిన వరుస ఎన్నికల్లో ఎమ్మేల్యేగా, ఎంపీగా ఓడిపోయినవారు నామినేటెడ్ పోస్టులు కోసం ఆశాపడుతున్నారు. ఇప్పటికే ఆ పదవుల్లో కొనసాగుతున్నవారు రెన్యువల్ కోసం పోటీపడుతున్నారు. ఎక్స్‌టెన్షన్‌ దొరికితే రెండేళ్లు పదవిలో ఉండొచ్చనుకుంటున్నారు. కానీ కేసీఆర్ మదిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు. పదవి దక్కినా, ఊడినా నోరెత్తే పరిస్థితి లేదు.

నామినేటేడ్‌ పదవుల పంపకం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కానీ ఆ ముహూర్తం ఎప్పుడో ఎవ్వరికీ అంతు చిక్కడంలేదు. అసెంబ్లీ సమావేశానికి ముందే ఉంటుందా లేక తర్వాత ఉంటుందా అనే అంచనా కూడా అందడంలేదు. టీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్పొరేషన్లు, పలు రకాల కమిషన్‌లకు కలిపి 50 ఛైర్మెన్ పోస్టుల భర్తీ జరిగింది. అయితే వీటిలో కమిషన్‌ల పదవీకాలం మినహా దాదాపు అన్ని కార్పొరేషన్‌ల పదవీ కాలం ముగిసింది. అయితే 2018 ఎన్నికలకు ముందు మూడు కార్పొరేషన్‌లకు మాత్రమే పదవీకాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. ఇప్పుడు వాటి పదవీ కాలం కూడా ముగిసి నెలలు గడుస్తున్నప్పటికీ రెన్యూవల్ జరగలేదు. కొత్తవారిని నియమించే పనీ జరగలేదు. మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే రెన్యువల్ చేయవచ్చనే అంచనాలు మొదలయ్యాయి. కొత్త ముఖాలకు అవకాశం లభిస్తుందన్న ఊహాగానాలూ వచ్చాయి. కానీ కొద్దిమంది ఆశావహుల్లో నిరాశే మిగిలింది. ఇటీవల ఊహించని తీరుగా ఆర్టీఐ కమిషన్ పదవుల్లో టీఆర్ఎస్ పార్టీ నేతలు శంకర్ నాయక్, మహ్మద్ అమీర్‌లకు పదవులు రావడంతో మిగితా వారిలో టెన్షన్ మొదలయింది.

నామినేటెడ్ పదవులపై పెద్దగా ఆశలు లేని వారికే పెద్ద పదవులు వస్తున్నాయంటే. మనకు రెన్యూవల్ ఉంటుందా లేదా మన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తారా అనే అనుమానం చాలామంది నేతల్లో మొదలయింది. దీంతో రెన్యూవల్ కోసం కేసీఆర్‌, కేటీఆర్‌ దగ్గరకు నేతలు క్యూ కడుతున్నారు. పాతవారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇలా అలస్యం చేస్తున్నారనే చర్చ కూడా పార్టీలో జరుగుతోంది. రెన్యూవల్‌ కాకపోతే తమ పరిస్థితి ఏంటి అని వివిధ కార్పొరేషన్‌ల మాజీ ఛైర్మన్‌లు మదనపడుతున్నారు.

Next Story

Most Viewed