లాక్ డౌన్ కొనసాగింపే ఉత్తమ మార్గం

by  |
లాక్ డౌన్ కొనసాగింపే ఉత్తమ మార్గం
X

– ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌లో కె.కేశవరావు

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ (కొవిడ్ -19) వ్యాప్తిని భారతదేశంలో సమర్థవంతంగా నియంత్రించడానికి లాక్‌డౌన్ పొడగింపునకు మించిన మార్గంలేదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్రమోడీకి స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ బుధవారం అన్నిపార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్ వ్యవహారంపై వీరితో చర్చించారు. లోక్‌సభ, రాజ్యసభలో కనీసం ఐదుగురు ఎంపీలున్న ప్రతి పార్టీ ఫ్లోర్ లీడర్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు(రాజ్యసభ), లోకసభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తూ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగున్నయని కొనియాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుతున్నారని తెలిపారు. లాక్‌డౌన్ వల్ల కష్టనష్టాలున్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన మార్గమని తెలిపారు. ఒకసారి పట్టువిడిస్తే పరిస్థితులు అధ్వానంగా మారుతాయన్నారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమనీ, ఎక్కువ వైద్య సదుపాయాలు లేని గ్రామాలకు వైరస్ విస్తరిస్తే పరిస్థితి చేయి దాటి పోతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితిని ఎదుర్కొవడానికి చాలా కష్టపడుతున్నమన్నారు. వలస కూలీల బాగోగులు చూసుకుంటున్నమనీ, పేద కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1,500 నగదు అందిస్తుమని కె.కేశవరావు ప్రధాన మంత్రికి తెలిపారు. రాష్ట్రాలకు కావాల్సిన నిధులు అందిస్తూ పాత బకాయిలు కూడా చెల్లించాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు మీరు తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందన్నారు కేవలం పీఎంవో ద్వారానే నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు రావనీ, కేంద్రీకరణ చాలా ముఖ్యమని కేశవరావు ప్రధానికి తెలిపారు. జీతాల్లో కోత, ఎంపీ ల్యాడ్స్ విషయంలో నిర్ణయానికి మద్దుతు ఇస్తున్నట్టు చెప్పారు. తెలంగాణలో రాబడులు పడిపోయాయనీ, రోజుకు రూ.400 కోట్ల రాబడి రావాల్సి ఉండగా అత్యంత కష్టంగా కేవలం రూ.1 కోటి ఆదాయమే సమకూరుతుందని కేంద్రం నుంచి నిధులు సమకూర్చాలని కోరారు.

Tags: pm video conference, on covid 19, lockdown, all floor leaders

Next Story