ఈటలపై టీఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు

by  |
ఈటలపై టీఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రి గంగుల కమలాకర్ ను కలిశారు. మండలంలోని శనిగరం, మర్రిపల్లి గూడెం గ్రామానికి చెందిన పలువురు ఆదివారం మంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు ఈటల రాజేందర్ పై ఆరోపణలు చేశారు.

రాజీనామా చెయ్…

ఆత్మగౌరవ నినాదం తీసుకొస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తన బలమేంటో నిరూపించుకోవాలని టీఆర్ఎస్ నాయకుడు పింగిలి ప్రదీప్ రెడ్డి డిమాండ్ చేశారు. కేడర్ ను పట్టించుకోకుండా నచ్చిన వారిని నాయకులుగా తయారు చేసిన ఈటల రాజేందర్ తమ గ్రామాల అభివృద్ధి గురించే పట్టించుకోలేదన్నారు. తన బలమెంటో నిరూపిస్తానని చెప్పి వెయ్యి కార్లతో హుజురాబాద్ కు వచ్చి వెల్లిన ఆయన కరోనా అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ వెంటే ఉంటాం…

అభివృద్ధి విషయంలో ఈటల రాజేందర్ ఏ మాత్రం పట్టించుకోలేదని శనిగరానికి చెందిన వాడికర్ రామారావు అన్నారు. ఉద్యమం ఆరంభం నుండి పని చేసిన తమను ఈటల రాజేందర్ విస్మరించారన్నారు. సద్దిమూటలు కట్టే దొంగలనే దగ్గరకు తీసుకొచ్చుకున్నారు కానీ అసలైన ఉద్యమ కారులను పట్టించుకోలేదని ఆరోపించారు. రానున్న రోజుల్లో కేసీఆర్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.

పార్టీని చీల్చాడు…

గ్రామంలో రెండు వర్గాలుగా టీఆర్ఎస్ పార్టీని చీల్చిన ఘనత రాజేందర్ కే దక్కుతుందని మర్రిపెల్లి గూడానికి చెందిన వాల్మీకి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చందబోయిన రవిందర్ అన్నారు. బీసీ ప్లాట్ల విషయంలో గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు పెట్టించాడన్నారు. దగ్గర ఉండే అనుచరులకు పనిచేస్తూ, ఇసుక దందాను ప్రోత్సహించాడన్నారు. గ్రామానికి చెందిన వారు చనిపోతే చెట్ట కింద పెట్టుకుని దహన సంస్కారాలు చేసుకున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఈటలకు అండగా నిలిచేది లేదని స్పష్టం చేశారు.

Next Story