మీకెందుకంత ‘తుత్తర’.. కేటీఆర్‌ను మెప్పించిన వారికే ఆ పదవులు..?

by  |
ktr
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ పదవులపై ఆశావహులు నజర్ వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పెండింగ్‌లో ఉన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని ఇటీవల భర్తీ చేయగా.. సీనియర్ టీఆర్ఎస్ నాయకులు ఎల్‌ఎంబీ రాజేశ్వర్‌కు ఆ పదవిని కట్టబెట్టారు. తాజాగా నిజామాబాద్ నగరంలో రెండు ఆలయ పాలక మండళ్లకు కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లాలో కీలకమైన నిజామాబాద్ మార్కెట్ కమిటీ, ఆర్మూర్ మార్కెట్ కమిటీ, నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ పదవులపై గులాబీ నేతలు కన్నేశారు. ఇటీవల అధికార పార్టీలో పదవులను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ స్వయంగా ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కనుసన్నుల్లో కొత్త కార్యవర్గాల కూర్పునకు రంగం మొదలైంది. అందులో భాగంగా ఆశావహులు పార్టీ పదవుల నియామకంలో తమను పరిశీలనలోకి తీసుకోవాలని పార్టీ నేతలకు పలువురు వినతులు సమర్పించడం మొదలైంది. సెప్టెంబర్ మాసంలో ప్లీనరీ నాటికి పదవుల భర్తీకి కసరత్తు జరుగుతోంది.

ఇదిలాఉండగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మార్కెట్ కమిటీల పాలకవర్గాలు కొలువుదీరడం ఇటీవల జోరందుకున్నది. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మార్కెట్‌గా పేరు గాంచిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి కాలం ముగిసి దాదాపు రెండు సంవత్సరాలకు చేరువలో ఉంది. చివరి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కులాచారి దివ్య ఉండగా.. ఆ తర్వాత కొత్త కార్యవర్గం ఏర్పడనే లేదు. నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గం గత కొన్ని రోజులుగా రూరల్ నియోజకవర్గానికే దక్కుతూ వస్తోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోకి నందిపేట్, నవీపేట్, మాక్లూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మండలాలు వస్తాయి. ఏడాదికి రూ.3 కోట్ల మేర మార్కెట్ సెస్ ఇక్కడ వసూలు అవుతుంది. ఈనామ్ ద్వారా జరిగే పసుపు క్రయవిక్రయాల మార్కెట్ విలువ వందల కోట్లకు పైగానే జరుగుతుంది. నిజామాబాద్ పసుపు మార్కెట్‌కు ప్రసిద్ది. దాంతో పాటు మొక్కజొన్న, వరి, ఆమ్ చూర్ విక్రయాలు ఇక్కడే ఎక్కువ జరుగుతాయి. స్వతహాగా నిజామాబాద్ మార్కెట్ కమిటీ పాలకవర్గంపై అధికార పార్టీలో చాలా మంది నేతల కన్ను ఉంది. ఈసారి రూరల్ నియోజకవర్గం వారికే పదవి దక్కుతుందనే చర్చ కూడా మొదలైంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీతో పాటు ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం లేక సంవత్సరాలు గడుస్తోంది. మార్కెట్ కమిటీ అధికారులే ఇప్పటికీ ఇంచార్జిలుగా కొనసాగుతున్నారు. కొత్త పాలకవర్గం పదవులను దక్కించుకునేందుకు ఆయా లోకల్ ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవుల కొరకు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేల సమిష్టి నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

నిజామాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పదవులపై లోకల్ లీడర్ల కన్ను ఉంది. నాలుగు నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన ‘నూడా’ పదవి పై ఇప్పటికే చాలా మంది నేతలు నజర్ వేశారు. ఇప్పుడున్న పాలకవర్గం పదవీ కాలం ముగిసినా దానిని ఆరు నెలలకు ఒకసారి పొడగించారు. రెండవ సారి పొడగింపు ప్రక్రియలోనే ప్రస్తుత పాలకవర్గం కొనసాగుతుంది. నూడా పరిధిలోకి ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో ఈసారి నిజామాబాద్ రూరల్ నేతలు నూడా పదవిపై కన్నేశారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను అర్బన్ నేతలకు అప్పగించాలని, తమకు నూడాను ఇవ్వాలని డిమాండ్ పెట్టినట్లు సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ అగ్రనేతల వద్దకు చేరినట్లు తెలిసింది.

నూడా పాలకవర్గం పదవీ కాలం గడిచిన ఏడాదే ముగిసిన నేపథ్యంలో దానిపై నజర్ వేసిన నేతలు జోరుగా పైరవీలు చేస్తున్నారు. కొందరు నేతలు తమకే పదవి గ్యారెంటీ అని ఏకంగా కార్లు కూడా కొనుగోలు చేసి సిద్ధం చేసుకోవడం విశేషం. అయితే, ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగిసినప్పటికీ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి కారణంగా కొత్త పాలకవర్గం ఎంపిక చేయడం లేదనే వాదనలున్నాయి. జిల్లాలో కార్పొరేట్ పదవుల్లో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేకుండా పోతుందనే కొత్త పాలకవర్గం ఎంపిక జరుగలేదనే విమర్శలున్నాయి. జిల్లాలో కీలకమైన నూడా, నిజామాబాద్, ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాలకు ముఖ్యమంత్రి పర్యటనకు ముందే ప్రకటిస్తారనే చర్చ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లు అధికార పార్టీ నేతల అండదండలున్న వారు ఆయా పదవులను దక్కించుకునేందుకు నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.



Next Story

Most Viewed