ఎమ్మెల్సీ ఎన్నికల్లో బైపోల్ ఫీవర్.. టీఆర్ఎస్‌కు తిరుపతి ‘వెంకన్న’నే దిక్కు..?

by  |
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బైపోల్ ఫీవర్.. టీఆర్ఎస్‌కు తిరుపతి ‘వెంకన్న’నే దిక్కు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హుజురాబాద్ బై పోల్స్ ఫీవర్ కనిపిస్తోంది. అటు అధికార పక్షం ఆ ఫలితాలు రిపీట్ కావద్దని అనుకుంటుంటే అవే ఫలితాలు ఎదురవుతాయని ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో హుజురాబాద్ ప్రభావం ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నిర్విరామంగా పనిచేసి అక్కడి ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేసింది. అన్ని రకాలుగా ప్రయత్నించి ఈటలను ఓడించాలన్న సంకల్పంతో ముందుకు సాగింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం ఈటల వెంటే నడవడంతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు అందుకోలేకపోయింది. ఈ ఎన్నికలు ముగిసిన నెల రోజులు తిరగకముందే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో అదే ఫలితం పునరావృతం అవుతుందని ప్రత్యర్థులు అంచనా వేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన వ్యతిరేకత ఉండడం తమకు లాభం చేకూర్చుతుందని భావిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లోనూ ఎన్ని ఎత్తులు వేసినా చివరకు తామే గెలుస్తామని అనుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధుల్లోనూ నైరాశ్యం నెలకొనడం వల్ల తమకు అనుకూలంగా ఉంటారని అనుకుంటున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన అభ్యర్థులు తమ గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ భానుప్రసాదరావుపై ఉన్న వ్యతిరేకత వల్ల కూడా ఆయనకు ఓట్లు వేసే అవకాశాలు లేవని కూడా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాము గెలిచి తీరుతామని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ హుజురాబాద్ రిజల్ట్ రిపీట్ అవుతుందన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు.

టీఆర్‌ఎస్ భారీ వ్యూహం..

అయితే హుజురాబాద్ బై పోల్స్‌లో విఫలం అయిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. హుజురాబాద్ బై పోల్స్‌లో చేసిన పొరపాట్లను గుర్తించిన అధిష్టానం వాటిని సరిదిద్దుకుంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదపుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 1324 మంది ఓటర్లలో మెజార్టీ ఉన్నా కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రజా ప్రతినిధులందరినీ కూడా క్యాంపులకు తరలించి వారి వెంట ముఖ్యమైన నాయకులు ఉండేలా జాగ్రత్త పడింది. బెంగళూరు, గోవాలాంటి పర్యాటక ప్రాంతాల్లో టూర్లు చేపట్టింది.

అయితే పోలింగ్ నాటికల్లా వీరిని ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేర్చేందుకు ప్లాన్ చేసింది. అయితే అనూహ్యంగా మరో ఎత్తుగడతో ముందుకు సాగాలని భావిస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను తిరుమల వెంకన్న దర్శనానికి కూడా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆదివారం తన నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులను తిరుపతికి కూడా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదే పద్ధతిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అమలు చేస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అయితే వెంకన్న సన్నిధిలోకి చేరిన తరువాత స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల నుండి మాట తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో అధిష్టానం వ్యూహాత్మకంగా ఈ ఎత్తుగడను వేయనున్నట్టు సమాచారం.


Next Story