తెలంగాణలో కొలువులతో పదవుల జాతర..!

by  |
తెలంగాణలో కొలువులతో పదవుల జాతర..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పదవుల జాతర షురూ కానుంది. రెండో టర్ములో రెండేళ్లపాటు హనీమూన్‌లా సాగిన పాలన క్రమంగా పట్టాలెక్కుతోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం సమూల మార్పులకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలనుకుంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులలో ఉన్న అసంతృప్తినే కాకుండా, అసంతృప్తి నేతలను కూడా శాంతింపజేయాలనుకుంటున్నారని తెలిసింది. సంక్రాంతి కొత్త కాంతిని తేనుందా?

ప్రభుత్వాన్నీ, పార్టీని ఏక కాలంలో గాడిన పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఉద్యుక్తులవుతున్నారు. ఏ కార్పొరేషన్‌కు, ఏ కమిషన్‌కు ఎవరిని నియమించాలనేదానిపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. వారం రోజులలో కనీసం 25 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తున్నారని సమాచారం. రాష్ట్రంలో కార్పొరేషన్లు, కమిషన్లు దాదాపు 75 వరకు ఉన్నాయి. కొన్నింటికి చైర్‌పర్సన్లు ఉన్నారు. కొన్ని ఏడాది నుంచి ఖాళీగా ఉన్నాయి. వాటిని ఇంతకాలం పట్టించుకోలేదు. పదవీ కాలాన్ని కూడా పొడిగించలేదు.

తాజా ఎన్నికల ఫలితాలతో పార్టీ శ్రేణులు దూరం కాకుండా జాగ్రత్తపడాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల చివరికల్లా మహిళా కమిషన్‌కు కొత్త చైర్‌పర్సన్‌ను, సభ్యులను నియమించాల్సి ఉంది. గురువారం పదవీ విరమణ చేస్తున్న రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సహా నలుగురు సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించాల్సి ఉంది. ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న సోమారపు సత్యనారాయణ పదవీ కాలం చాలా రోజుల క్రితమే పూర్తయ్యింది. ఆయన వేరే పార్టీలోకి కూడా వెళ్లిపోయారు. టెక్నలాజికల్ సర్వీసెస్ ఛైర్మన్ రాకేశ్ రెడ్డి పదవీకాలం ముగిసినా పొడిగించడం లేదా కొత్తవారిని నియమించే పక్రియ జరగలేదు.

ఆశల పల్లకిలో

అనేక కార్పొరేషన్లకు చైర్మన్లు నియమితులు కాలేదు. బేవరేజెస్ కార్పొరేషన్, సాగునీటి పారుదల అభివృద్ధి సంస్థ, బీసీ కమిషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, వైద్య సేవలు-మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, ఫైనాన్స్ కార్పొరేషన్ (ఇది విభజన చట్టం ప్రకారం పెండింగ్‌లో ఉంది), సమాచార హక్కు కమిషన్ ఇలా పదుల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో అర్హులైనవారిని ఎంపిక చేసి వారం రోజులలోనే ఉత్తర్వులు జారీ అసే అవకాశం ఉందని సమాచారం. మరికొన్ని కార్పొరేషన్లు, కమిషన్ల పదవీకాలం త్వరలో ముగియనుంది. వాటి విషయంలో కూడా సత్వరం నిర్ణయం తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.

ప్రస్తుతం సభ్యులుగా ఉన్నవారు చైర్మన్‌ పోస్టును ఆశిస్తున్నట్లు తెలిసింది. బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్న వకుళాభరణం కృష్ణ మోహన్ ఈసారి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల పదవీ విరమణ చేసిన కారెం రవీందర్ రెడ్డి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కావాలనుకుంటున్నట్లు సమాచారం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా ఉన్న విఠల్ ఆ సంస్థ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటివాటన్నింటిపై ముఖ్యమంత్రి త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పార్టీ, ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ప్రకియ అంతా వచ్చే సంక్రాంతి పండుగలోగానే జరగాలని భావిస్తున్నట్టు సమాచారం

పీఆర్సీ ప్రకటన

త్వరలో పాలనాపరంగా, పార్టీపరంగా భారీ స్థాయిలో మార్పులు ఉంటాయని వార్తలు వస్తున్న సమయంలో నామినేటెడ్ పోస్టుల ప్రక్రియ తొలుత చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎలాగూ ప్రభుత్వ ఉద్యోగులను సంతృప్తిపర్చడానికి పీఆర్సీ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నెల రోజులలోనే కంటికి కనిపించే విధంగా భారీ స్థాయిలో మార్పులు ఉంటాయని, అసమ్మతికి తావులేని విధంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు వివరించారు.

Next Story

Most Viewed