అనురాధకు వ్యతిరేకంగా రోడెక్కిన టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు..

by  |
trs Councilors protest
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధిలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల పోటాపోటీ ఆందోళ‌న‌ల‌తో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కింది. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌ను, టీఆర్ఎస్ కౌన్సిల‌ర్‌ను టార్గెట్ చేస్తూ సోమ‌వారం చైర్ పర్స‌న్‌, కాంగ్రెస్ కౌన్సిల‌ర్లు ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తే… మంగ‌ళ‌వారం రోజున చైర్ ప‌ర్స‌న్ తీరుకు వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు నిర‌స‌న తెలిపారు.

మున్సిపాలిటీ ఆఫీసు ఎదుట టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల ఆందోళ‌న‌

అన్ని వార్డుల‌కు స‌మానంగా నిధులు కేటాయించి, స‌మ‌న్యాయం చేయాలంటూ మున్సిప‌ల్ ఆఫీసు గేటు ఎదుట టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు ఆందోళ‌న నిర్వ‌హించారు. చైర్ ప‌ర్స‌న్‌కు, కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఈ సంద‌ర్భంగా కౌన్సిల్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడ‌ర్ ర‌మావ‌త్ క‌ల్యాణ్‌నాయ‌క్ మాట్లాడుతూ “చైర్ ప‌ర్స‌న్ అనురాధ రాంరెడ్డి టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల ప‌ట్ల వివ‌క్ష చూపుతూ, కొన్ని వార్డుల‌కే నిధులు కేటాయిస్తున్నార‌ని ఆరోపించారు. ఇప్ప‌టివ‌ర‌కు రూ.18.50కోట్ల ప‌నుల‌కు కౌన్సిల్ తీర్మానించింద‌ని, ఇందులో ఆరుగురు టీఆర్ఎస్ కౌన్సిల‌ర్ల‌కు కేవ‌లం రూ.30ల‌క్ష‌లు మాత్ర‌మే కేటాయించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి కౌన్సిల‌ర్లుగా ఉన్న‌ 4, 11వ వార్డుల‌కు ఇంత‌వ‌ర‌కు రూపాయి కూడా కేటాయించ‌క‌పోవ‌డం శోచ‌నీయమ‌న్నారు.

చైర్ ప‌ర్స‌న్ అనుయాయుల‌కే నిధులు కేటాయిస్తూ, మిగ‌తావారిని ప‌ట్టించుకోక‌పోవ‌డం దుర్మార్గ‌మైన చ‌ర్య అని అన్నారు. ఎస్సీ, ఎస్టీల వార్డుల‌కు ప్ర‌త్యేకంగా కేటాయించాల్సిన నిధుల‌ను కూడా ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని, దీనిపై ఎస్సీ, ఎస్టీ క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేస్తామ‌న్నారు. అన్నివార్డుల‌కు స‌మానంగా నిధులు కేటాయించి, స‌మ‌న్యాయం చేసేవ‌ర‌కు సీఆర్ నెంబ‌ర్ ఇవ్వొద్ద‌ని డిమాండ్ చేశారు. అక్ర‌మ నిర్మాణాల విష‌యంలో కాంగ్రెస్ కౌన్సిల‌ర్ల‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌నే క‌మిష‌న‌ర్‌పై, అధికారుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. చైర్ ప‌ర్స‌న్ తీరును నిర‌సిస్తూ పుర‌పాల‌క‌ మంత్రి కేటీఆర్‌కు, క‌లెక్ట‌ర్‌కు, ఎమ్మెల్యే కిష‌న్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామ‌ని” తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ కౌన్సిల‌ర్లు పుల్ల‌గుర్రం కీర్త‌నావిజ‌యానంద్‌రెడ్డి, గుండా భాగ్య‌మ్మ ధ‌న్‌రాజ్‌, వేముల స్వాతి అమ‌రేంద‌ర్‌రెడ్డి, సంగీత మోహ‌న్ గుప్తా, సిద్దాల జ్యోతి జంగ‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed