నేనేంటో నాకు తెలుసు.. నిజమని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : టీఆర్ఎస్ కౌన్సిలర్

by  |
trs-counsiler
X

దిశ, మేడ్చల్ టౌన్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కేవీ రెడ్డి నగర్‌లో చిరు వ్యాపారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఆరోపణలను వార్డు కౌన్సిలర్ వీణ సురేందర్ గౌడ్‌తో పాటు-కౌన్సిల్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేవీ రెడ్డి నగర్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమకు సంబంధించిన ఛానల్‌ను వినియోగించుకొని, తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

44వ జాతీయ రహదారి పక్కన ఉన్న దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు కావడం వల్లే మున్సిపాలిటీ నుంచి తొలగించారన్నారు. ఇందులో తమ ప్రమేయమేమి లేదన్నారు. సదరు వ్యాపారులకు ఎన్నో రోజులుగా మున్సిపాలిటీ, జలమండలి నుంచి సమాచారం ఉందని చెబుతున్నారని తెలిపారు. అధికారుల మాట పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకున్నారని వివరించారు. అంతేగానీ ప్రతీ దుకాణాదారుడి నుంచి రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. దీనిని నిరూపిస్తే తాను కౌన్సిలర్ పదవికీ, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తానని వీణాసురేందర్ గౌడ్ సవాల్ విసిరారు. నిబంధనల ప్రకారమే దుకాణాలను తొలగిస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. దుకాణాల్లో పడుకున్న వారికి ప్రాణనష్టం జరిగిందని, దొంగల్లా రాత్రికి రాత్రే కూల్చివేశారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. వారి వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా డబ్బులు డిమాండ్ చేస్తే, ప్రాణ నష్టం జరిగినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీలో పని చేస్తూ రాత్రి భవంళ్లూ ప్రజలకు సేవ చేస్తున్నానని చెప్పారు.

అధికారంలోనికి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రూ.1.50 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక.. ఇక తమ పార్టీలకు పుట్టగతులు ఉండవన్న భయంతో కొందరు నాయకులు అమాయకులను మభ్య పెడుతున్నారని ఫైర్ అయ్యారు. తమపై ఆరోపణలు చేస్తున్న కౌన్సిలర్ శ్రీనివాస్ ఖాళీ స్థలాల్లో గుడిసెలు వేయించి, కూలీ నాలీ చేసుకొనే వారి నుంచి నెలకు రూ.1000 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి పాల్పడే వ్యక్తులు తమపై ఆరోపణలు చేయడం హస్యాస్పదమన్నారు. కేవీరెడ్డి నగర్‌లో వినాయకుడి షెడ్ ఏర్పాటు చేసి, శుభకార్యాలయాలకు స్థలం లేకుండా చేస్తున్నారని ఆరోపించారన్నారు. ఆ స్థలాన్ని నా వ్యక్తిగతంగా వినియోగించుకుంటే చెప్పాలన్నారు. ఇకనైనా అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని, లేదంటే తగిన బుద్ధిచెపుతామని హెచ్చరించారు. కాగా పలువురు చిరు వ్యాపారులు కళావతి, వాణి, కృష్ణ, రమేశ్, లింగం తదితరులు మాట్లాడుతూ.. తమను ఎవరూ డబ్బులు అడగలేదని, కౌన్సిలర్ వీణ ఎప్పుడు తమ వద్దకు రాలేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి వైస్ చైర్మన్ ప్రభాకర్ కౌన్సిలర్లు దోడ్ల మల్లికార్జున్, ఫిలిప్స్, బాల్రాజ్, టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, వెంకట్, సంజీవ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed