చిచ్చురేపిన జీబీఆర్ కాంప్లెక్స్.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల బాహాబాహీ..

68
trs

దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన తాలూకా స్థాయి కబడ్డీ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతు పంపిణీ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జీబీఆర్ కాంప్లెక్స్ కూలగొడతామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యాపారుల సొమ్ముతో దుకాణాలు సముదాయాన్ని నిర్మించి గులాబీ కలర్ వేయడమే కాకుండా దానికి జీబీఆర్ కాంప్లెక్స్ అని పేరు పెట్టడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిదిగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు తయారయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే జిబిఆర్ పేరేను తొలగిస్తానని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

డీసీసీ అధ్యక్షుడుని అడ్డుకున్న టీఆర్ఎస్ నేతలు..

జీబీఆర్ కాంప్లెక్స్‌పై డీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్ పార్టీ వర్గీయులు దానిని తీవ్రంగా ఖండించారు. అంతేగాకా రోడ్డుపైకి వచ్చి మాజీ ఎమ్మెల్వే ఎదుటనే ఆందోళనకు దిగారు. వంశీకృష్ణ కళ్ల ఎదుటే ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. దీనికి ప్రతీగా కాంగ్రెస్ వర్గీయులు ఎమ్మెల్యే గువ్వల బాలారాజ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆయా పార్టీల వారు ఎదురెదురుగా నిల్చుని నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ ఘటనతో దాదాపు రెండు గంటల పాటు మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని సద్దుమణిగించారు.