‘గులాబీ గూడే’ దిక్కు..ఈటలకు అనుచరుల షాక్!

230

దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కోటకు బీటలు వారుతున్నాయి. ఆయన వెన్నంటే ఉంటారనుకున్న వారు ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. నిన్న మొన్నటి వరకు ఈటల వెంటే మేము అంటూ ‘జై ఈటల… జై జై ఈటల’ అన్న గొంతులే ఇప్పుడు జై కేసీఆర్, జై జై కేసీఆర్ అనడం ఆరంభించాయి. శుక్రవారం హుజురాబాద్, జమ్మికుంట పట్టణాలకు చెందిన మునిసిపల్ ఛైర్మన్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాము టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని, ఈటలతో కలిసి నడిచేది లేదని స్పష్టం చేశారు. దీంతో ఈటల రాజేందర్‌కు అత్యంత నమ్మకమైన వారిగా ముద్ర పడ్డవారే ఆయనకు దూరం అయినట్టయింది.

కేసీఆరే మా నేత…

పార్టీ జెండా మీద గెలిచిన తామంతా టీఆర్ఎస్ పార్టీలొనే కొనసాగుతామని హుజురాబాద్ మునిసిపల్ ఛైర్ పర్సన్ గందె రాధిక స్పష్టం చేశారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ… పార్టీ వల్ల వచ్చిన ఈ పదవుల్లో కొనసాగుతున్న తాను టీఆర్ఎస్‌లోనే కొనసాగుతాను తప్ప ఈటలకు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాల మేరకు తనతో పాటు మునిసిపల్ పాలకవర్గం కూడా టీఆర్ఎస్ లోనే కొనసాగతామన్నారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ నిర్మల, 16 మంది కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమా దేవి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎసే నా ప్రాణం..

టీఆర్ఎస్ పార్టీయే తనకు ప్రాణమని జమ్మికుంట మునిసిపల్ ఛైర్మన్ తక్కళ్ల పల్లి రాజేశ్వర్ రావు అన్నారు. మునిసిపల్ పాలకవర్గ సభ్యులు కూడా కేసీఆర్ నాయకత్వంలోనే పని చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. హుజురాబాద్ లో ఎలాంటి రాజకీయా పరిణామాలు చోటు చేసుకున్నా తాను గులాభి గూటిలోనే కొనసాగుతానన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..