ఎమ్మెల్యే, మంత్రి కార్లను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

by  |
ఎమ్మెల్యే, మంత్రి కార్లను అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు
X

దిశ, ముషీరాబాద్: అడిక్‌మెట్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం వడ్డెర బస్తిలో జరిగింది. ఈ సమావేశంలో డివిజన్ పార్టీ ఎన్నికల ఇంఛార్జ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థి తరఫున అందరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. సిట్టింగ్ కార్పొరేటర్ హేమలత రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించిందని సమావేశంలో మంత్రి వెల్లడించడంతో అసమ్మతి సెగలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చివరి వరకు తనకు టికెట్ కేటాయిస్తున్నామని చెప్పి మోసం చేస్తారా అంటూ మంత్రి సమక్షంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌‌ను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మనోహర్ సింగ్ నిలదీశారు.

ముఠా గోపాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చి మనోహర్ సింగ్ తన వర్గీయులతో రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. సమావేశానంతరం బయల్దేరిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్లను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో వాగ్వాదానికి మనోహర్ సింగ్ దిగారు. గత ఎన్నికల్లోనే తనకు టికెట్ ఇస్తామని చెప్పి నామినేషన్ ఉపసంహరణ చేయించారని మనోహర్ సింగ్ గుర్తు చేశారు. నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఇప్పుడు టికెట్ తనకే కేటాయిస్తామని నమ్మించి చివరి క్షణంలో మాట తప్పారని ఎమ్మెల్యే పై మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని గమనించిన పోలీసులు మనోహర్ సింగ్‌తో పాటు అతని వర్గీయులను పక్కకు తప్పించి ఎమ్మెల్యే, మంత్రి కార్లు వెళ్లేందుకు దారి చూపించారు.



Next Story

Most Viewed