వైద్యులు లేక ఇబ్బందులు.. పట్టించుకోని అధికారులు…

by  |
వైద్యులు లేక ఇబ్బందులు.. పట్టించుకోని అధికారులు…
X

దిశ, పాలకుర్తి : పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో వైద్యుల కొరత వేధిస్తోంది. మండల చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. వైద్యం కోసం ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయిస్తు ఆర్ధికంగా చితికిపోతున్నారు. గైనకాలిస్టు, పిల్లల వైద్యులు, దంత వైద్యలు, నలుగురు ఎంబీబీఎస్ వైద్యులు, ఆరుగురు స్టాఫ్ నర్సులతో వైద్యం అందించాల్సిన 30 పడకాల ఆసుపత్రిలో ముగ్గురు మహిళా కాంట్రాక్టు వైద్యులు దిక్కై, నలుగురు స్టాఫ్ నర్సులతో వైద్యంను నెట్టుకోస్తున్నారు. వ్యాధి నిర్ధారణ కేంద్రంలో టెక్నీషియన్ ఒక్కరే కరోనా, వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తూ అవస్థలు పడుతున్నారు. కరోనా పరీక్షలకు వెళ్లినప్పుడు ఇతర నిర్ధారణ పరీక్షలు నిలిపి వేయవలసిన పరిస్థితి దాపురించింది.

గతంలో పాలకుర్తి ఆసుపత్రిలో విధులు నిర్వహించిన టెక్నీషియన్ ను జనగామ జిల్లా కేంద్రానికి బదిలీ చేయడంతో రోగనిర్ధారణ పరీక్షలు అలస్యం అవుతున్నాయి. దీంతో రోగులు అసహనానికి గురవుతున్నారు. పాలకుర్తి ఆయుష్ డాక్టర్ వరంగల్ లో విధులు నిర్వహించడంతో ఇక్కడ ప్రజలకు ఆయుష్ వైద్యం అందకుండా పోయింది. ఉన్నత శ్రేణి ఆసుపత్రికి రెగ్యులర్ డాక్టర్ లేకపోవడంతో నిధుల, నియామకాల విషయంలో శ్రద్ధ చూపేవారే కరువైనారని రోగులు ఆరోపిస్తున్నారు. కొడకండ్ల మండల మెడికల్ ఆఫీసర్ కు పాలకుర్తి ఆసుపత్రి డ్రాయింగ్ అధికారిగా అదనపు బాధ్యతలు రావడంతో అంటిముంటనట్లు వ్వవహరిస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. కొన్ని ఏళ్ళుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ సిబ్బంది కొరతను అధిగమించుటలో ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు ఏమాత్రం చోరవచూపడం లేదని స్థానికులు అంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రిపై దృష్టి సారించి అవసరమయ్యే వైద్యులను, సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.

వైద్యులను నియామించాలి…

పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి మెడికల్ ఆఫీసర్ తోపాటు సిబ్బందిని నియామించాలి. పోస్ట్ మార్టం సౌకర్యం కల్పిస్తే కొడకండ్ల, దేవరుప్పుల, జఫర్ గడ్ మండలాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు అన్ని ఆసుపత్రిలో జరుగేవిధంగా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలి.
-మామిండ్ల రమేష్ రాజా…సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి

గర్భ నిర్థారణ కు పూర్తి పరీక్షలు …

ఆసుపత్రిలో స్త్రీలకు గర్భ నిర్ధారణకు పూర్తి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. బీపీ, షుగర్, మలేరియా, టైఫాయిడ్, ఎయిడ్స్, కరోనా పరీక్షలు చేస్తున్నాము. మిగితా పరీక్షలకు జనగామకు పంపుతున్నాము. పోస్ట్ మార్టం ప్రారంభం వైద్యవిధాన పరిషత్ పరిధిలో ఉంటుంది. ఆసుపత్రిలో రిపేరు పనులు జరుగుతున్నాయి.
-ప్రియాంక కాంట్రాక్టు వైద్యాధికారి…పాలకుర్తి ఉన్నత శ్రేణి ఆసుపత్రి


Next Story

Most Viewed