అన్నదాతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ జిల్లాను వదలని వరుణుడు

by  |
అన్నదాతల్లో టెన్షన్ టెన్షన్.. ఆ జిల్లాను వదలని వరుణుడు
X

దిశ, నిజామాబాద్ రూరల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరో 15 రోజులైతే ఖరీఫ్ వరి పంట కోతలు ప్రారంభించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో ఉమ్మడి జిల్లాలో అడపా-దడపా వర్షాలకు రైతుల్లో భయాందోళన నెలకొంది. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు కురవడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఇది ఇలా ఉంటే గులాబ్ తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షానికి ఉమ్మడి జిల్లాలో వరి పంట నేలకొరిగింది.

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పెద్ద మొత్తంలో వరి సాగు చేశారు. 80% పైగా రైతులు వరి సాగు చేసినట్టు వ్యవసాయ అధికారి గోవింద్ పేర్కొన్నారు. 20 శాతం సోయా, మొక్కజొన్న, కంది, మినుములు, పెసర పప్పు పంటలు సాగు చేశారని ఆయన తెలిపారు. గులాబ్ తుఫాన్‌తో జిల్లాల్లో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని, మళ్లీ వర్షం కురిస్తే రైతులు కోలుకోని స్థితిలోకి వెళ్ళి వెళ్తారని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గులాబ్ తుఫాన్‌కు అడ్డం పడిన వరి చేను‌పై మళ్లీ వర్షం కురిస్తే పంట పూర్తిగా దెబ్బ తిని చేతికి రాకుండా పోతుందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం సహకరిస్తే రెండు నెలల్లో ఖరీఫ్ పంట కోతలు పూర్తయిబయట పడతామంటున్నారు.

సోయా, మొక్కజొన్న వేసిన రైతులు కోసిన పంటను ఆరబెడుదామంటే.. వర్షాలు అయోమయ పరిస్థితుల్లో పడేస్తున్నాయి. ఓ పక్క దళారులకు క్వింటాలుకు రూ. 1300కి అప్పజెప్పి తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు. ఇటువంటి ఆపద కాలంలో ప్రభుత్వాలు ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్దతు ధరలు ప్రకటించినప్పటికీ.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంట చేతికి వచ్చే దాకా రైతుల పరిస్థితి కత్తి మీద సాము లాగే ఉన్నట్టుందని వాపోతున్నారు.


Next Story