కృష్ణా జలాల వినియోగం.. డెడ్​స్టోరేజీకి వెళ్లొద్దు

by  |
కృష్ణా జలాల వినియోగం.. డెడ్​స్టోరేజీకి వెళ్లొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కృష్ణా జలాల వినియోగంలో శ్రీశైలం, నాగార్జున సాగర్​ జలాశయాల్లో కనీస నీటిమట్టాలను నిర్వహించాలని, డెడ్​స్టోరేజీకి వెళ్లకుండా కేటాయింపులు ఉండాలని తెలంగాణ జల వనరుల శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఏపీ ఇచ్చిన ఇండెంట్​తో కనీస నీటి మట్టాలకు ప్రమాదం ఉందని తేల్చి చెప్పింది. శ్రీశైలంలో 800 అడుగులపైన, సాగర్​లో 510 అడుగుల పైన ఉన్న నీటిని పరిగణలోకి తీసుకుని రెండు రాష్ట్రాల వాటాను లెక్కించాలని సూచించిన ఏపీ వాదనను తెలంగాణ కొట్టిపారేయడంతో ఇండెంట్​ను తగ్గించుకునేందుకు ఏపీ అంగీకరించింది.

కృష్ణా ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాల వినియోగం, తాగు, సాగు నీటి అవసరాలు, కేటాయింపుల అంశంపై శుక్రవారం బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ భేటీ జలసౌధలో జరిగింది. ఈ భేటీకి ఏపీ తరఫున ఈఎన్‌సీ నారాయణరెడ్డి, తెలంగాణ తరఫున సాగర్‌ సీఈ నరసింహా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్య వాదనలు జరిగాయి. ఈ ప్రాజెక్టుల్లో కనీస నీటిమట్టాలను మెయింటెన్​ చేయాలని తెలంగాణ స్పష్టం చేసింది. డెడ్​స్టోరేజీకి వెళ్లకుండా మార్చి నెలాఖరు వరకు కేటాయింపులు చేయాలని సూచించింది. మరోవైపు క్యారీ ఓవర్​ జలాల అంశంలో ఏపీ పట్టుమీదుంది. ప్రతి ఏడాది తెలంగాణ వాటాలో కొంత నీటిని తాగునీటి, అత్యవసర అవసరాల కోసం సాగర్​లో నిల్వ చేసుకుంటుందని, వీటిని వచ్చే వాటర్​ ఇయర్​ ఖాతాలో పరిగణలోకి తీసుకోవద్దంటూ తెలంగాణ కోరింది. ఏపీ దీనికి అంగీకరించలేదు. కానీ దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వ కమిటీ పరిశీలిస్తోందని వెల్లడించారు.

కాగా కృష్ణాలోని శ్రీశైలం, సాగర్​ నుంచి మార్చి నెలాఖరు వరకు 83 టీఎంసీలు తెలంగాణ, 108 టీఎంసీలను ఏపీ కేటాయించాలని బోర్డుకు ఇండెంట్​ పెట్టాయి. సాగర్‌ ఎడమ కాల్వ కింద 40 టీఎంసీలు, ఏఎంఆర్‌పీ కింద 18 టీఎంసీ, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 4.50టీఎంసీ, మిషన్‌ భగీరథకు 2.50 టీఎంసీలు మొత్తంగా సాగర్‌లో 65 టీఎంసీల నీటిని కేటాయించాలని వివరించారు.

ఏపీ ఈఎన్‌సీ మార్చి వరకు 108 టీఎంసీలు కావాలన్నారు. దీనిలో భాగంగా శ్రీశైలంలో ఎండీడీఎల్​ దిగువకు వెళ్లి 800 అడుగుల వరకు, సాగర్​లో 510 అడుగుల వరకు నీటిని వినియోగిస్తామని చెప్పడంపై తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఎండీడీఎల్​ కచ్చితంగా పాటించాలని సూచించింది. దీంతో బోర్డు కూడా ఇదే సూచించడంతో ఏపీ ఇండెంట్​ను తగ్గించుకునేందుకు ఒప్పుకుంది. డెడ్​స్టోరేజీకి కట్టుబడి ఏపీ 95 టీఎంసీల మేరకు కొత్తగా ఇండెంట్‌ ఇస్తామని చెప్పింది. గత ఏడాదిలో ఏపీ ఎక్కువ నీటిని వాడుకుందని, వాటిని ఈసారి లెక్కల్లో తీసుకోవాలని తెలంగాణ సూచించింది. దీనిపై రెండు రాష్ట్రాలు వాదనకు దిగుతుండటంతో మరోసారి సమావేశంలో చర్చించేందుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూల్​–కడప కాలువ నీటి వినియోగంలో రాత్రి ప్రవాహాన్ని లెక్కించాలని ఏపీ చెప్పగా తెలంగాణ మాత్రం పగటిపూట వాడకాన్ని లెక్కించాలని సూచించింది. చెన్నైకి తాగునీటి సరఫరా అంశంలో సరఫరా చేసిన మొత్తం నీటిలో మూడింట రెండొంతులు ఏపీ, ఒక వంతు తెలంగాణ ఖాతాలో లెక్కించాలని ఏపీ ఈఎన్సీ చెప్పగా తెలంగాణ మాత్రం 5 టీఎంసీల వరకు మాత్రమే లెక్కించాలని, మిగతా నీటిని ఏపీ ఖాతాలోనే వేయాలని తేల్చి చెప్పారు.

సాగర్​ ఎడమ కాల్వ నుంచి నీటి లీకేజీ ఎక్కువగా ఉంటుందని, దీంతో ఏపీలోని దిగువ ప్రాంతాల్లోని పంటలన్నీ ముంపునకు గురవుతున్నాయని ఏపీ పేర్కొంది. ఈ లీకులతో కింది పంటలకు తీవ్ర నష్టం జరుగకుండా అవసరాల కోసం మళ్లించామని, వాటిని లెక్కల్లోకి తీసుకోవద్దని ఏపీ ఈఎన్సీ సూచించారు. అలాగే సాగర్‌ కుడికాల్వ హెడ్‌ రెగ్యులేటర్‌ లీకులతో గత ఏడాది నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 1వరకూ 17,313 క్యూసెక్కులు (1.49 టీఎంసీలు) సాగర్‌ కుడి కాలువలోకి చేరాయని, నీటి అవసరాలు లేకపోవడంతో ఆ నీళ్లన్నీ వృథా అయ్యాయని ఏపీ ఈఎన్సీ చెప్పారు. వైజాగ్​కు కృష్ణా బోర్డును తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసినా ఆపమని ప్రకటించారు.


Next Story

Most Viewed