తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిన మహిళ.. కారణం తెలిసి షాక్ అయిన పోలీసులు..

by Sumithra |
తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిన మహిళ.. కారణం తెలిసి షాక్ అయిన పోలీసులు..
X

దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఓ వైపు ఆశ్చర్యాన్ని, మరోవైపు భయాన్ని కలిగిస్తాయి. మరికొన్ని విషయాల పై ఇది ఎలా జరిగింది అంటూ ప్రజలను ఆలోచించేలా చేస్తుంది. ప్రస్తుతం అలాంటి ఒక దారుణమైన విషయం బయటికి వచ్చింది. ఆ విషయం గురించి తలచుకుంటే చాలు టక్కున్న కింద పడిపోవాల్సిందే. మరి ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సంఘటన తైవాన్‌లోని దక్షిణ నగరమైన కాహ్‌సియుంగ్‌ లో జరిగింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఓ మహిళ తన తండ్రితో 50 సంవత్సరాలకు పైగా నివసిస్తున్నట్లు తెలిపారు. ఆమె తండ్రి చనిపోవడానికి చాలా కాలం ముందు తన తల్లి కూడా మరణించింది. దాంతో ఆమె తన తండ్రితో పాటు జీవనం సాగిస్తుంది. అయితే తన తండ్రి కూడా చనిపోవడంతో పెన్షన్‌ డబ్బుల కోసం మహిళ తండ్రి మృతదేహాన్ని ఖననం చేయకుండా సంవత్సరాలుగా ఇంటి లోపల దాచిపెట్టిందని తెలిపారు.

అనుమానంతో పోలీసులు..

గత ఏడాది నవంబర్‌లో డెంగ్యూ నివారణ రసాయనాలను స్ప్రే చేయడానికి వచ్చిన ఆరోగ్య అధికారులను తన ఇంటిలోకి అనుమతించనందున ఆమెకు NT$60,000 (US$1,800) జరిమానా విధించారు. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులకు ఆమె పై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు పోలీసు అధికారులు మహిళను కలుసుకుని ఆమె వృద్ధ తండ్రి గురించి విచారించారు. దాంతో ఏం చేయాలో తెలియని ఆ మహిళ పోలీసులకు ఏవేవో కథనాలను వినిపించింది.

మొదట ఆమె తండ్రి నర్సింగ్‌హోమ్‌లో ఉన్నాడని తెలిపింది. తర్వాత పోలీసుల ఒత్తిడితో తన కథను మార్చుకుంది. ఈసారి తన సోదరుడు తమను సొంత గ్రామానికి తీసుకెళ్లాడని తెలిపింది. ఎందుకో అనుమానం వచ్చి పోలీసులు విచారించగా మహిళ సోదరుడు చనిపోయి 50 ఏళ్లయ్యిందన్న విషయం బయటికి వచ్చింది. దీంతో పోలీసులు మరోసారి విచారించగా మరో కథ చెప్పింది. తన తండ్రి మెయిన్‌ల్యాండ్‌లో చనిపోయాడని, అయితే అతని మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించలేకపోయానని ఆమె చెప్పింది.

ఇంట్లో సోదాలు..

అయితే మహిళ కథనాన్ని నమ్మని పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు చేయడం ప్రారంభించారు. శోధన సమయంలో వారు ఒక నల్లటి ప్లాస్టిక్ సంచిని కనుగొన్నారు. అందులో ఒక వృద్ధుడి ఎముకలు ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి కొంతకాలం క్రితమే మృతి చెందినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఎముకలకు ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించారు. ఈ రిపోర్టులో వృద్ధుడు చనిపోయి కనీసం ఒకటి లేదా రెండు సంవత్సరాలు అయి ఉంటుందని తేలింది. ఎందుకంటే సాధారణంగా శరీరం అస్థిపంజరం కావడానికి ఒకటి నుండి రెండు సంవత్సరాలు పడుతుంది.

పింఛను కోసం ఇలా..

నివేదికల ప్రకారం మహిళ తండ్రి ఆర్మీ అధికారి. 20 సంవత్సరాలకు పైగా దేశ సేవలో ఉన్నారు. రిటైర్డ్ అయ్యాక అతను తన ర్యాంక్, సర్వీస్ హిస్టరీని బట్టి నెలవారీ పింఛను పొందేవాడు. ఈ పింఛన్‌ కోసం మహిళ కొన్నాళ్లుగా తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం ఆ మహిళ తన తండ్రి మృతదేహాన్ని దాచిపెట్టడమే కాకుండా మరేదైనా నేరానికి పాల్పడిందా అనే కోణంలో పోలీసులు వృద్ధుడి మృతికి గల కారణాల పై ఆరా తీస్తున్నారు.

Next Story