పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. స్తంభించిన రాకపోకలు

180
Kmm

దిశ, పాలేరు : ఖమ్మం జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం అర్ధరాత్రి ప్రారంభమైన వర్షం గురువారం సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. గ్రామాల్లో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు కనీసం నడవలేని స్థితికి చేరుకున్నాయి. అక్కడక్కడా వాగులు, వంకలు, ఒర్రెలు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

పాలేరు నియోజకవర్గంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు, ఆకేరు, పాలేరువాగు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలేరు రిజర్వాయర్‌లోకి పాలేరు వాగు నుంచి క్యాచ్ పాయింట్ సుమారు 150 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పాలేరు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 23 అడుగులు కాగా ప్రస్తుతం 13.75 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. రిజర్వాయర్‌కు ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో లేదు. పాలేరు, వివిధ గ్రామాల మత్స్యకారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నేలకొండపల్లి మండలం చెర్వుమాధారం గ్రామంలో చెరువు, సుద్దవాగు తాండ చెక్ డ్యామ్ వరదకి నీళ్లు మత్తడి దూకుతున్నాయి.

గళ్ళ వాగు ఉధృతితో స్తంభించిన రాకపోకలు..

నర్సింహులగూడెం-కిష్టాపురం గ్రామాల మధ్య గళ్ళ వాగు ఎగువన కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. గతంలో కూడా ఈ వాగు ఉధృతికి నర్సింహులగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, అతని బైక్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో, అప్రమత్తమైన కూసుమంచి సీఐ సతీష్, ఎస్‌ఐ సందీప్ గురువారం కిష్టాపురం-నరసింహులగూడెం గ్రామాల మధ్య ఉన్న గళ్ళ వాగు వద్దకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుతున్నాయని.. దీంతో వాగులు వంకలు పొర్లిపొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని కోరారు. వాగుల్లో నీరు అధికంగా ప్రవహించే సమయంలో వాటిని దాటే ప్రయత్నం చేయకూడదన్నారు.

చేపల వేటకు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు. వరదల వల్ల ఇబ్బందులు ఉంటే పోలీస్, రెవెన్యూ శాఖల వారికి సమాచారం అందించాలన్నారు. అదే విధంగా కూసుమంచి మండలంలోని ఈశ్వరమాధారం-మంగలితండా గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో, కోదాడ వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాజుపేట-ఈశ్వరమాధారం గ్రామాల మధ్య వరద ఉధృతితో రాకపోకలు స్తంభించాయి.

Kmm1

Kmm2

kmm3

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..